ఎన్నికల ముందు “వై నాట్ 175 “ఇదే మా ఎలెక్షన్ల నినాదం అంటూ ఊదరగొట్టిన వైసీపీ నాయకులు ఎన్నికల తరువాత “వై నాట్ ప్రతిపక్ష హోదా” అనే స్థాయికి దిగజారిపోయారు. ఓటమికి అనేక సాకులు వెతుకుంటూ తమను తాము సతాయించుకుంటూ పార్టీ క్యాడర్లో ధైర్యం నింపడానికి గెలిచిన సీట్ల సంఖ్యను కాదు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనించండి అంటూ తృప్తి పడుతున్నారు వైసీపీ నాయకులు.
ఓడిపోయాం అనే వాస్తవంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న వైసీపీ నోటి దూల నాయకులు కింద పడిన పై చెయ్యి మాదే అంటూ ఒంటెద్దు పోకడలు పోతున్నారు. 151 నుంచి 11 కి పడిపోయినా, గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన ఏ ఒక్క వైసీపీ నేత గెలవకపోయిన తాము చేసిన తప్పేమిటో తెలుసుకోకుండా ముగ్గురు కలిసి ఒక్కరిని ఓడించారు అంటూ చక్కటి కవర్ డ్రైవ్ కబుర్లు చెపుతున్నారు వైసీపీ మాజీలు.
అలా చూస్తే 2019 ఎన్నికలలో కూడా టీడీపీ పార్టీకి 39 .17 % ఓట్ షేర్ వచ్చి 23 సీట్లను సాధించింది. అయితే ఆ సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓట్ షేర్ 49 . 95 % . ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసం సుమారు 10 %. ఇప్పుడు వైసీపీ పార్టీది కూడా అదే పరిస్థితి అయినప్పటికీ వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
అయితే మాకు 40 % ఓటు శాతం ఉంది, మాది బలమైన రాజకీయ పార్టీ, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, మా మాట నెగ్గాల్సిందే అంటూ ఇతండ వాదన ఆడుతున్న వైసీపీ ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదే 40 % ఓట్లతో గతంలో టీడీపీ పార్టీ నేతలు అసెంబ్లీకి వస్తే వారిని ఎంతలా అవమానించారో, ఎంతలా హేళన చేసారో వైసీపీ నేతలు మరిచిపోయిన ప్రజలింకా మరిచిపోలేదు.
మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మీ మాటకు అసెంబ్లీ లోనే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ విలువ లేదని ఎద్దేవా చేస్తూ నోటికి వచ్చిన బూతులన్నీ ప్రయోగించి అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను కించపరిచారు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చే సరికి నెగ్గిన సీట్లు కాదు వచ్చిన ఓట్ పర్శంటేజ్ ను పరిగణలోకి తీసుకోవాలి అంటూ పట్టుబడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతు తృప్తి పడుతున్నారు.




