తెలుసా? వైసీపికి పూర్వవైభవానికి బొత్స బీజం వేశారట!

Botsa Satyanarayana

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిడిపి పోటీ చేయకూడదని సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో వైసీపి అభ్యర్ధి బొత్స సత్యనారాయణ పోటీ లేకుండా గెలువబోతున్నారు. ఆయన గెలుపుతో వైసీపి పూర్వవైభవానికి బీజం వేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కనిపెట్టి చెప్పారు.

స్థానిక సంస్థలలో వైసీపికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకుడిని అభ్యర్ధిగా బరిలో దింపినప్పుడే వైసీపికి ఓటమి భయం కలిగిందని స్పష్టమైంది. టిడిపి వలన కలిగిన ఆ భయాన్ని మళ్ళీ టిడిపియే పోగొట్టింది. కనుక బొత్స సత్యనారాయణ ఇందుకు సిఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ ఆయన ఏదో పెద్ద పోరాటం చేసి గెలిచి వైసీపిని ఉద్దరించారన్నట్లు చెప్పుకోవడం వైసీపికి, అంబటి రాంబాబుకే చెల్లు.

ADVERTISEMENT

ఇప్పుడు వైసీపి, టిడిపి కూటమి ప్రభుత్వం పరిస్థితిని, ఎన్డీయేలో టిడిపి ప్రాధాన్యం పెరగడాన్ని చూస్తున్నవారు ఎవరైనా వైసీపి మళ్ళీ కోలుకోవడం కష్టమే అని చెప్పగలరు. ఇంతకాలం తాను సింగిల్ సింహం- చంద్రబాబుది తోడేళ్ళ గుంపు అని ఎద్దేవా చేసిన జగన్‌, ఇప్పుడు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారు.

జగన్‌ తన పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవడానికి, ఆనాడు విభేదించి, ద్వేషించి, రాజకీయంగా నిర్వీర్యం చేసి దెబ్బ తీసిన కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దపడుతుండటం గమనిస్తే, వైసీపి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

కనుక బొత్స సత్యనారాయణ ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకున్నంత మాత్రాన్న ఆయనకు, వైసీపికి కొత్తగా ఒరిగేదేమీ ఉండబోదు.

కానీ కాంగ్రెస్‌తో జగన్‌ డీల్ చేసుకోవడంలో విఫలమైతే, బొత్స సత్యనారాయనకు కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరిస్తే, వైసీపిలో అందరి కంటే ముందుగా ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. కనుక ఈ వయసులో ఆయన దేనికీ బీజం వేయలేరు.

జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళపాటు నరకం చూశారు. కనుక ఒకవేళ జగన్‌ లేదా అంబటి రాంబాబు లేదా మరొకరో అంతగా వైసీపికి పూర్వవైభవం చూడాలని అనుకుంటే హాయిగా నిద్రపోయి కలలో చూసుకోవచ్చు. వేరే ఆప్షన్ లేదు.

ADVERTISEMENT
Latest Stories