
బొత్స సత్యనారాయణ కుటుంబం విజయనగరం జిల్లాలో పాతుకుపోయి, అల్లుకుపోయుందనేది బహిరంగ రహస్యం. జిల్లాలో రాజకీయాలు కావాచ్చు… ఇసుక, క్వారీలు, మద్యం, రియల్ ఎస్టేట్ మరే వ్యాపారాలైనా కావచ్చు. సమస్తం బొత్స కుటుంబం ఆధీనంలోనే ఉంటాయి. వారి కనుసైగలతోనే సాగుతుంటాయి.
ఏ గాలివాటం లేకపోతే బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, వారి మద్దతు అందుకుంటున్నవారే ఎన్నికలలో గెలుస్తుంటారు.
Also Read – మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్: హ్యాండ్సప్
విజయనగరం జిల్లాలో అంతగా పాతుకు పోయి విస్తరించిన బొత్స కుటుంబానికి జగన్ విశాఖని కూడా రాసిచ్చేయాలని అనుకున్నారు!
అందుకే లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణిని విశాఖ రప్పించి పోటీ చేయించారు. కానీ గాలివాటం మారడంతో ఆమె ఓడిపోయారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేయడానికి జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంవీవీ సత్యనారాయణ ఇంకా పలువురు పోటీ పడ్డారు. కానీ జగన్ వారందరినీ కాదని విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ విశాఖకు దిగుమతి చేసి ఆ సీటు ఇచ్చారు.
అంటే విశాఖలో వైసీపి నేతలెవరి మీద జగన్‌కు నమ్మకం లేదనుకోవచ్చు. బొత్స సత్యనారాయణ అదృష్టం కొద్దీ చివరి నిమిషంలో టిడిపి వెనక్కు తగ్గడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
ఇది ఆయనకు కలిసి వచ్చింది. ‘టిడిపి గర్వాన్ని అణిచివేసి బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధించారంటూ” వైసీపి సర్టిఫికేట్ జారీ చేసింది. ఆయన ఏవిదంగా గెలిచినప్పటికీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కనుక ఇకపై విశాఖలో వైసీపి రాజకీయాలను ఆయనే పర్యవేక్షించబోతున్నట్లు భావించవచ్చు.
జగన్ 5 ఏళ్ళ పాలనలో వైసీపి నేతలు విశాఖలో పార్టీని బలోపేతం చేసుకొని ఉండి ఉంటే నేడు బొత్స సత్యనారాయణని రప్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ వారు ప్రధానంగా విశాఖ చుట్టుపక్కల భూములపైనే దృష్టి పెట్టడంతో నగరానికి చేసిందేమీ లేదని విశాఖ ప్రజలు ఆగ్రహించారు.
అందుకే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన బొత్స ఝాన్సీరాణి ఏకంగా 5.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోగా, గాజువాక నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 95వేల పైచిలుకు ఓట్ల తేడాతో, భీమిలి నుంచి పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు 91 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారని చెప్పవచ్చు.
ఈ నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో వైసీపి నేతలను పక్కనపెట్టి బొత్స సత్యనారాయణని విజయనగరం నుంచి దిగుమతి చేసి జిల్లాని ఆయనకు అప్పగించేశారని అనుకోవచ్చు. ఇందుకు ప్రతిగా విశాఖ జిల్లాలో వైసీపిని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించాల్సి ఉంటుంది.
అందుకు సిద్దపడే బొత్స సత్యనారాయణ విశాఖ టికెట్ తీసుకున్నారు. కనుక ఇప్పుడు విశాఖ టిడిపి నేతలు ఆయనను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి.