పూర్వం ఓ రాజుగారు దేనిని తాకితే అది బంగారం అయిపోవాలని వరం పొందారు. కంచంలో ఆహారాన్ని ముట్టుకుంటే అదీ బంగారమైపోయిందిట. అలాగే జగన్, వైసీపీ నేతలు దేనిని ‘టచ్’ చేసినా దానిలో అవినీతి, అప్పులు, అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి.
మారుమూల గ్రామాలలో నివసించే ప్రజలకు కూడా ఇంటర్‌నెట్ సౌకర్యం, వినోదం అందుబాటులోకి తేవాలనే మంచి ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్‌ని ఏర్పాటు చేస్తే, జగన్, వైసీపీ నేతలు దానినీ తెలివిగా వాడేసుకున్నారు.
వైసీపీ నేతల ఇళ్ళలో పనిచేసే 410 మంది పనివాళ్ళకు దానిలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని చూపిస్తూ వారందరికీ ఏపీ ఫైబర్ నెట్ నుంచి నెలనెలా జీతాలు చెల్లించేవారనే కొత్త విషయం బయటపడింది. అదైనా వారికి చెల్లించారో లేక వైసీపీ నేతలే ఉద్యోగుల పేరుతో మింగేశారో ఇంకా తెలీదు.
ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా నియమితులైన జీవీ రెడ్డి స్వయంగా ఈ విషయం బయటపెట్టారు. వైసీపీ నేతల సిఫార్సు లేఖలతో ఏపీ ఫైబర్ నెట్‌లో 610 మందిని నియమించారని, వారిలో ఏ ఒక్కరికీ కనీసం విద్యార్హతలు కూడా లేవని చెప్పారు. కనుక ముందుగా 410 మందిని తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగిస్తున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలో తొలగిస్తామని చెప్పారు.
వారికి నెలనెలా జీతాలు చెల్లించినందుకు ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూధన్ రెడ్డి బాధ్యులు కనుక ఆయనకి నోటీస్ జారీ చేశామని చెప్పారు. ఈ అక్రమాలు సరిపోవన్నట్లు ఏపీ ఫైబర్ నెట్ పేరుతో జగన్ ప్రభుత్వం రూ.1,260 కోట్లు అప్పులు చేసిందని, సంస్థ కోసం పనులు చేసిన గుత్తేదారులకు రూ.900 కోట్లు బిల్లులు చెల్లించకుండా దిగిపోయిందని జీవీ రెడ్డి చెప్పారు.
శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా అప్రదిష్టపాలుజేసి రాజకీయంగా దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం రాంగోపాల్ వర్మ చేత ‘వ్యూహం’ అనే సినిమా తీయించి, ఏపీ ఫైబర్ నెట్ ఖాతా నుంచే ఆయనకు రూ.1.15 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఆ సొమ్ముని 15 రోజులలో తిరిగి చెల్లించాలని లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని రాంగోపాల్ వర్మకి నోటీస్ పంపిన్నట్లు జీవీ రెడ్డి తెలిపారు.
ఇటువంటి తప్పుడు పని చేసి దొరికిపోతే ఎవరైనా సిగ్గుతో తలదించుకుంటారు. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ,”చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఉద్యోగులను అన్యాయంగా తొలగించి రోడ్డున పడేస్తున్నారు. మాపై మీకు కక్ష ఉంటే మాపైనే తీర్చుకోండి కానీ ఉద్యోగులను పీకేయడం దేనికి?” అంటూ విమర్శలు గుప్పించారు.
వైసీపీ చేసిందే తప్పు పని. పైగా ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేయడం ఇంకా తప్పు. తమపై చర్యలు తీసుకోమని అంబటి రాంబాబు స్వయంగా ప్రభువటానికి సవాలు విసురుతున్నారు కూడా. కనుక ఆయనకీ ఓ నోటీస్ పంపడం అవసరమేమో? కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది.




