టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో జిల్లాలలో సాగునీటి ప్రాజెక్టులను పరిస్థితిని పరిశీలించి రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న కడప జిల్లాలోని జగన్ సొంత నియోజకవర్గమైన పులిచింతలలో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు వేలాదిమందిగా ప్రజలు తరలివచ్చి జేజేలు పలకడంతో వైసీపీలో అందరూ ఉలిక్కిపడ్డారు.
మళ్ళీ నిన్న అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించినప్పుడూ వేలాదిగా జనాలు తరలివచ్చారు. ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలకు బాగానే జనాలు వచ్చేవారు కానీ ఈసారి రెట్టింపు సంఖ్యలో తరలివస్తుండటంతో జనాలు మార్పుకోరుకొంటున్నారని చంద్రబాబు నాయుడు విశ్లేషించి చెప్పారు.
ఆయన రోడ్ షోలకు వస్తున్న జనాలు, ఆయన మాటలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రం నలుమూలలకి చేరుతుంటాయి. కనుక ఆ ప్రభావం వారిపై కూడా పడుతుంటుంది. బహుశః అందుకే శుక్రవారం చంద్రబాబు నాయుడు అన్నమయ జిల్లాలోని కురబలకోట మండలంలోని అంగళ్ళులో పర్యటించేందుకు వస్తున్నారని తెలిసి, అక్కడ వైసీపీ జెండాలతో భారీగా కార్యకర్తలను మోహరించిన్నట్లు అనుమానించాల్సి ఉంటుంది. లేకుంటే చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవలసిన అవసరం ఏమిటి?
అంగళ్ళులో వేచి ఉన్న వైసీపీ కార్యకలు పొడవైన లాఠీ కర్రలకు వైసీపీ జెండాలు తగిలించుకొని రావడం గమనిస్తే వాటితో టిడిపి శ్రేణుల మీద విరుచుకు పడాలని వచ్చిన్నట్లు అర్దమవుతోంది. ఊహించిన్నట్లే వారు అంగళ్ళు పరిసర ప్రాంతాలలో చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెపుతూ టిడిపి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్లను చించివేశారు. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిందిన టిడిపి కార్యకర్తలపై వాటితో, రాళ్ళతో దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు సమీపంలోనే ఉన్నారు. కానీ వారిని అడ్డుకోలేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
ఈ ఘర్షణలను చూసి చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గలేదు. తగ్గితే ప్రతీసారి ఇలాగే చేసి ప్రజల మద్యకు రాకుండా చేస్తారు. కనుక ఆయన ముందుకే సాగారు.
అంగళ్ళ వద్ద ఇరువర్గాల మద్య ఘర్షణలు జరుగుతుండటంతో జనాలు దూరంగా ఉండిపోవలసివస్తోంది. చంద్రబాబు నాయుడు తమపై రాళ్ళ దాడి చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలను రాళ్ళ దాడి చేస్తే సహించి ఊరుకోబోమని గట్టిగా హెచ్చరించారు. వైసీపీ నేతల కనుసన్నలలో పోలీసులు పనిచేస్తుండటం వలననే వైసీపీ గూండాలను నియంత్రించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు చెందిన తనను ఎవరు అద్దుకొంటారో ముందుకు రావాలని సవాలు విసురుతూ ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం అంగళ్ళలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



