వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణంగా హత్య చేయబడిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు కాకినాడ జిల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈరోజు నియామక పత్రాన్ని అందజేశారు.
సోమవారం కాకినాడలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన కలెక్టర్ అపర్ణ విద్యార్హతలను దృవీకరించే సర్టిఫికేట్లను పరిశీలించిన తరువాత ఎస్సీ, ఎస్టీ పీవోఏ చట్టం కింద ఆమెకు నష్ట పరిహారంతో పాటు తక్షణం నియామక పత్రాలు సిద్దం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఏ.హనుమంతరావును ఆదేశించారు. వాటినే ఆమె ఈరోజు అపర్ణకు అందజేశారు.
ఆమె భర్తను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అతని రిమాండ్ గడువు నిన్నటితో ముగియడంతో జిల్లా కోర్టు దానిని జూలై 1వరకు పొడిగించింది.
ఈ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు ఆయనపై ఛార్జ్ షీట్ వేయడంతో వైసీపీ అనంతబాబుని పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ అనంతబాబు వలన పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగింది. ఒకవేళ ఈ కేసుపై అపర్ణ మీడియా ముందుకు వచ్చి ఇంకా ఏమైనా మాట్లాడితే వైసీపీకి, ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. బహుశః అందుకే అపర్ణకు ఈ ఉద్యోగంతో నోరు మూయించాలని వైసీపీ ప్రయత్నించిందేమో?అసలు ఈ కేసు విచారణ ఇంకా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో, అనంతబాబుకి శిక్ష పడుతుందో లేదో ఎవరికీ తెలీని పరిస్థితి.



