అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని జగన్ నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. అమరావతిని వద్దనుకున్నప్పుడు అంతకంటే గొప్పగా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ మరో రాజధాని ఏర్పాటు చేసి ఉండి ఉంటే ప్రజలు జగన్ తెలివితేటలకు, సమర్దతకు జేజేలు పలికేవారు.
కానీ కూల్చడం, వైసీపీ రంగులు వేసుకొని, తన బొమ్మలు పెట్టుకోవడం తప్ప నిర్మించడం తెలీని జగన్ ఏమీ చేయకపోయినా అమరావతికి, రాష్ట్రానికి తీరని నష్టం కలిగించి నందుకు ప్రజలు ఆయనని గద్దె దించేశారు. అయినా ఇంకా అమరావతికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేందుకు భయపడేలా చేస్తూనే ఉన్నారు.
ప్రపంచ బ్యాంక్ అమరావతి నిర్మాణ పనులకు రూ.15,000 కోట్లు మంజూరు చేస్తే, దాంతో పనులు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు పనులకు, వాటికయ్యే వ్యయాలకి మంత్రివర్గం ఆమోదం తెలుపడంతో ఈ నెల నుంచి పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్రక్రియ ముగించి మార్చి నుంచి ఒకేసారి అన్ని పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జగన్ హయంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అమరావతి రాజధాని సిద్దం అవుతుంటే దానికీ ఆటంకాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుండటం క్షమించరాని నెరమే. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రపంచ బ్యాంక్‌లోని ఇన్‌స్పెక్షన్ ప్యానల్‌కు డిసెంబర్ 18న ఓ ఈమెయిల్ పంపారు.
దానిలో ప్రభుత్వం అమరావతి కోసం రైతులను బెదిరించి బలవంతంగా భూసేకరణ చేసిందని, ఆ కారణంగా వారు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, అమరావతి నిర్మాణం వలన పర్యావరణ సమస్యలు, తీవ్ర సామాజిక సమస్యలు తలెత్తుత్తాయని ఆ లేఖ సారాంశం.
అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది వైసీపీయే కనుక ఆ పార్టీ అధినేత సూచన మేరకు లేదా ఆ పార్టీకి చెందినవారో లేదా మద్దతుదారులో ఈ లేఖ వ్రాసి ఉంటారని అనుమానించాల్సి వస్తోంది. కాదని వైసీపీ చెప్పగలదా?రాష్ట్రానికి ఇంత నష్టం కలుగజేసిన జగన్, ఇప్పుడు అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే, ప్రజలు ఎన్నటికీ క్షమించబోరు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినట్లే వైసీపీని కూడా భూస్థాపితం చేస్తారని గ్రహిస్తే మంచిది.




