వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలనుకొంటున్నానని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు.
సోమవారం ఆత్మకూరు పట్టణంలోని గీతా భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, “నేను ఇప్పటికే మా అధినేత చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి వచ్చే ఎన్నికలలో నేను శ్రీశైలం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొంటున్నాని చెప్పి టికెట్ నాకే ఇవ్వాలని కోరాను. నా గురించి సర్వే చేయించి ప్రజాభిప్రాయం నాకు అనుకూలంగా ఉంటేనే టికెట్ ఇమ్మనమని కోరాను. నాకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పాను. నంద్యాల ఎంపీ సీటుకి పార్టీలో బలమైన అభ్యర్ధులు చాలా మందే ఉన్నారు కనుక ఎవరిని నిలబెట్టినా నేను పూర్తి సహాయసహకారాలు అందిస్తానని చంద్రబాబు నాయుడుకి చెప్పాను. జగన్ పాలనలో సామాన్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఎన్నికలొస్తే సిఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు,” అని అన్నారు.
శ్రీశైలం నియోజకవర్గాన్ని 2014, 2019 ఎన్నికలలో వైసీపీయే గెలుచుకొంది. 2014లొ బుద్దా రాజశేఖర్ రెడ్డి గెలిస్తే, 2019లొ శిల్పా చక్రపాణి రెడ్డి గెలిచారు. పదేళ్ళుగా శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ ఆధీనంలోనే ఉంది కనుక అక్కడ టిడిపి జెండా ఎగురవేయాలంటే అక్కడ బలమైన అభ్యర్ధిని నిలబెట్టాల్సి ఉంటుంది. ఏరాసు ప్రతాప్ రెడ్డి 2009లో అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు కనుక తనకు నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉందని, కనుక టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలవగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



