ys jagan about 10th class results issueఓ గీతను చిన్నది చేయాలంటే దాని పక్కనే పెద్ద గీత గీయాలనే సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం బాగానే ఒంట పట్టించుకొందని చెప్పవచ్చు.

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడితే దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కూడా ఉంది. వాటి కంటే మన రాష్ట్రం పరిస్థితే కాస్త నయంగా ఉందని సర్ది చెప్పుకొన్నారు. కానీ పాలకులకు దూరదృష్టి లేకపోవడం వలననే ఈ సమస్య ఏర్పడిందని చెప్పక తప్పదు. పొరుగు తెలుగు రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం లేదు..విద్యుత్‌ కోతలూ లేవు. ఎందుకంటే, అక్కడి పాలకులకు దూరదృష్టి ఉంది కనుక.

ఏపీలో విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తే, అప్పుడూ జగన్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చూపించి అక్కడి కంటే మన దగ్గరే తక్కువ ఛార్జీలు ఉన్నాయని సర్ది చెప్పుకొంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచినప్పుడు, అక్కడి కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ ఛార్జీలు ఉన్నాయని గణాంకాలతో సహా వివరించి చూపింది! అంటే ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించిందన్న మాట!

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ఈరోజు జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “కరోనా కారణంగా రెండేళ్ళుగా విద్యార్దులు పరీక్షలు రాయకపోయినా వారిని పాస్ చేశాము. ఈ నేపధ్యంలో పిల్లలు పరీక్షలు వ్రాసి 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే అదీ ప్రభుత్వం వైఫల్యమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ గుజరాత్‌లో ఈసారి 65శాతం ఉత్తీర్ణత వచ్చింది. అంటే గుజరాత్‌ కంటే మనకి రెండు శాతం ఎక్కువే ఉంది కదా? పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్దులకు మనోధైర్యం పెంచడానికి సప్లిమెంటరీ పరీక్షలలో పాస్ అయిన రెగ్యులర్‌ పరీక్షలలో పాస్ అయినట్లుగానే పరిగణించాలని నిర్ణయం తీసుకొన్నాము,” అని అన్నారు.

నిజమే..గుజరాత్‌ కంటే మనకి రెండు శాతం ఎక్కువే వచ్చింది. ఒక వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు గుజరాత్‌ రాష్ట్రంతో పోల్చి చూపుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు కూడా పొరుగున ధగధగాయమానంగా వెలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూపి మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు?