వైసీపీకి రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏం సంబంధం అంటే ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఓ సాపత్యం కనిపిస్తోంది.
ఆమెరికాని ఢీ అంటే ఢీ అంటూ ఢీకొట్టేందుకు సిద్దమంటున్న రష్యా తమ సరిహద్దు పక్కనే ఉన్న పిల్లకాకి వంటి ఉక్రెయిన్‌ని కేవలం వారం రోజులలోనే లొంగదీసుకోగలమని అతిశయంతో యుద్ధం మొదలుపెట్టింది. కానీ దాదాపు మూడేళ్లుగా యుద్ధం చేస్తూన్నా ఇంతవరకు లొంగదీయలేకపోగా వేలాదిమంది సైనికులను కోల్పోయింది.
ఈ యుద్ధం కారణంగా ఆర్ధికంగా రష్యా చాలా దెబ్బతింది. రష్యా సైనికులు చనిపోతుంటే దేశ ప్రజలే అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాన్ని, యుద్ధ కాంక్షణి తప్పు పడుతున్నారు. యుద్దం విరమించమని కోరుతున్నారు.
దీనికి పరిష్కారంగా మొదట సిరియా దేశస్తులను రష్యా తరపున ఉక్రెయిన్‌పై పోరాడేందుకు బరిలో దింపితే వారందరూ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు తన సైనికులను రష్యా తరపున పోరాడేందుకు పంపారు.
సుశిక్షితులైన వారిపై ఉక్రెయిన్ సైనికులు అమెరికా అందించిన అత్యాధునిక డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టారు. ఊహించని ఈ పరిణామంతో డజన్ల కొద్దీ ఉత్తర కొరియా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారు భయంతో పరుగులు తీస్తుంటే ఉక్రెయిన్ సైనికులు వారిని డ్రోన్లతో వేటాడి మరీ మట్టుబెడుతున్నారు.
అధినేత ఆదేశం మేరకు తమకు సంబంధంలేని యుద్ధరంగంలో దిగి పోరాడినందుకు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి.
1. ధూర్తులతో సహవాసం చేస్తే ఇటువంటి ఫలితమే వస్తుంది. ఉత్తర కొరియా, రష్యా రెండూ ఇప్పుడు ధూర్త దేశాలుగా ముద్రపడ్డాయి. కనుక రష్యాకు సాయం చేయబోతే ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోతున్నారు.
2. ఈ యుద్ధం పుతిన్ వల్లనే మొదలైంది. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు వారిస్తున్నా ఆయనే దీనిని కొనసాగిస్తున్నారు. కానీ ఆయన తన ప్యాలస్‌లో హాయిగా, భద్రంగా, ఆరోగ్యంగానే ఉన్నారు. అయన ఆదేశాలు కాదనలేక యుద్ధ రంగంలోకి వెళ్ళినవారే బలైపోతున్నారు.
అక్కడ యుద్ధంలో రష్యాతో పాటు ఇతర దేశాల సైనికులు కూడా మరణిస్తున్నారు. ఇక్కడ జగన్ కోసం వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, ఉన్నతాధికారులు, విదేశీ సైనికులు వంటి రాంగోపాల్ వర్మ, పోసాని, లక్షల మంది వాలంటీర్లు బలైపోతున్నారు.
అక్కడ పుతిన్, ఇక్కడ జగన్‌ని నమ్ముకొని, వారి కోసమే యుద్ధరంగంలో దిగిన ప్రతీ ఒక్కరూ బలైపోయారు. అయినా పుతిన్, జగన్ ఇద్దరూ తమ విలాసవంతమైన ప్యాలస్‌లో హాయిగా గడిపేస్తున్నారు. ఉత్తర కొరియా సైనికులు డ్రోన్లకు బలైపోతుంటే, ఇక్కడ జగన్ కోసం యుద్ధాలు చేసినవారి మెడలకు కేసులు ఉచ్చుల్లా బిగుసుకుంటున్నాయి. అంతే తేడా.. మిగిలినదంతా సేమ్ టూ సేమ్!




