వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి నేటితో 12 ఏళ్ళు పూర్తి కావడంతో, జగన్ అనుయాయులు వాటిని గుర్తు చేసుకుంటూ నాటి విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
వైసీపీ ఏర్పాటుతో ఆగ్రహించిన కాంగ్రెస్ తనను జైలుకు పంపించింది అంటూ అప్పట్లో జగన్ అండ్ కో చేసిన అలజడి తెలియనిది కాదు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అదే పాటను అప్పుడప్పుడూ వైసీపీ అండ్ కో ఆలపిస్తున్నారు.
ఆ అరెస్ట్ అనంతరం జగన్ ద్వారా దాదాపుగా 1400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిందే. కానీ ఈ ఆస్తుల అటాచ్ మెంట్ పై జగన్ మరియు ఆయన అనుచరులు మాత్రం వివరణ ఇవ్వరు.
ఎలాంటి అవినీతి చేయని పక్షంలో, ఈడీ చేసిన ఆస్తులపై జగన్ ఎందుకు నోరు మెదపరు? 16 నెలల జైలు జీవితం అనంతరం బెయిల్ పై బయటకు వచ్చి ఏకంగా సీఎం సీటు స్థాయికి చేరుకున్న వైనం తెలిసిందే.
ఆ సీఎం పదవి మరో వారం రోజుల్లో ముగియనుండడమే ఇప్పుడు అసలు టాపిక్. సీఎం సీటుతో పాటు జగన్ బెయిల్ కూడా పూర్తవుతుందనేది పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న మాటలు.
ఇటీవల జగన్ లండన్ పర్యటన వెళ్తున్న సమయంలో… లండన్ వెళ్లిన సీఎం మళ్ళీ రారు, రాష్ట్రం విడిచి పారిపోతున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఒకవేళ లండన్ నుండి తిరిగి వచ్చినా, మళ్ళీ జగన్ జీవితం జైలుకే అంకితం అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా బలంగా ప్రజలకు తెలియజెప్పారు.
ఎప్పుడు ఏమవుతుందో తెలియాలంటే జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాలు నిర్ధేశింపజేయనున్నాయి. ఆ తర్వాత ఏపీ రాజకీయ మరో మలుపు తిరగనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!?




