మావయ్య డ్రామాలకు రిహార్సల్స్, టేకులు ఉండవు కానీ…

YS Jagan

సినిమాలలో హీరో హీరోయిన్లను, విలన్లను మరింత గొప్పగా చూపేందుకు దర్శకులు ప్రత్యేక సన్నివేశాలు సృష్టిస్తుంటారు. వాటిని బ్యాక్ గ్రౌండ్ సంగీతం, కెమెరా వర్క్‌తో మరింత హైలైట్ చేస్తుంటారు. వాటిని చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు. ఇంకా నచ్చితే చప్పట్లు కొడతారు ఆ సినిమాని హిట్ చేస్తారు.

ఈ ఫార్ములాని జగన్‌ కూడా ఫాలో అయిపోటున్నారు. జగన్‌ పరామర్శయాత్రకు బయలుదేరే ముందే ఆయా జిల్లా, ప్రాంతాలలో వైసీపీ నేతలు వేలాదిమందిని పోగు చేసి సిద్దంగా ఉంచుతారు.

ADVERTISEMENT

జగన్‌ రాగానే వారు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ, ఈలలు, కేకలు వేస్తూ ఆయన కాన్వాయ్‌కి అడ్డుపడిపోతుంటారు. మరికొందరిని ఆ మార్గంలో ఇళ్ళు, గోడలపై నిలబెట్టిస్తారు. వారు కూడా జగన్‌ చూసి ఆనందంతో మురిసిపోతున్నట్లు నటించేస్తుంటారు. ఆ ఫోటోలు, వీడియోలు సొంత మీడియాలో వేసుకొని ‘జగన్‌కు జనాలు నీరాజనాలు’ అనే హెడ్డింగ్ పెట్టుకొని గొప్పగా ఓ కధ వ్రాసేసి దానినీ ప్రజల మీదకు వదులుతుంటారు.

రాజమౌళి ఒకరిద్దరు నటీనటులతో ఓ సన్నివేశం చిత్రీకరించడానికి అనేక టేకులు తీసుకుంటారు. కానీ వైసీపీ నేతలు ఎటువంటి రిహార్సల్స్, రెండో టేకు తీసుకోకుండానే వేలాదిమందితో రాజమౌళి కంటే అద్భుతంగా ఇటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా నిర్వహించి, చిత్రీకరించి సొంత మీడియాలో వదులుతుంటారు.

సినీ దర్శకుల కంటే వైసీపీ నేతలకే ‘క్రియేటివిటీ’ ఎక్కువగా ఉందని నిరూపిస్తూ, ఈ డ్రామాలలో భావోద్వేగాలు కూడా పండించేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయితో జగన్‌ని హత్య చేసేందుకు సృష్టించిన ఆ సన్నివేశం చూసే అందరూ ఆశ్చర్యపోయారు.

మొన్న జగన్‌ విజయవాడలో పర్యటించినప్పుడు ఓ చిన్నారి జగన్‌తో సెల్ఫీ దిగాలని ఆరాటపడిపోతూ బోరున ఏడ్చేస్తుంటే అది చూసి జగన్‌ ఆ పాపని దగ్గరకు రప్పించుకొని సెల్ఫీ దిగారు. ఆ పాప కూడా అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. అది చూసి వైసీపీ నేతలకి ఇంత క్రియేటివిటీ ఉందా?వారి నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందని రాజమౌళితో సహా తెలుగు సినీ దర్శకులు అందరూ అనుకునే ఉంటారు.

కానీ ఇలాంటి డ్రామాలు చాతకాని టీడీపీ నేతలు ఎప్పుడూ మూస పద్దతిలో విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసేస్తుంటారు. నారా లోకేష్‌కి కూడా యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇటువంటి గొప్ప అవకాశం లభించింది కానీ ఆయన స్పందన చాలా భిన్నంగా ఉంది.

ఓ చిన్న పిల్లాడు పసుపు చొక్కా తొడుగుకొని, టీడీపీ జెండా పట్టుకొని వస్తే నారా లోకేష్‌ వెంటనే ఆ బాలుడి చేతిలో ఆ జెండాని, ఒంటిపై ఆ చొక్కాని స్వయంగా తీసేసి అక్కడి నుంచి పంపించేశారు. చిన్న పిల్లలని రాజకీయాలకు దూరంగా ఉంచండని ఆ పిల్లాడి తండ్రి (టీడీపీ కార్యకర్త)ని మందలించి ముందుకు సాగిపోయారు. నాడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. కానీ టీడీపీ దానిని వైరల్ చేయలేదు.

ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలను పోల్చి చూస్తే ఆ పాపతో జగన్‌ డ్రామా రక్తి కట్టి ఉండవచ్చు. వైరల్ అయ్యుండవచ్చు. కానీ అది డ్రామా అని అందరికీ అర్దమైపోతూనే ఉంది. జగన్‌ పర్యటనకి హైప్ సృష్టించేందుకు అంత జనం మద్యలోకి ఆ చిన్నారిని తీసుకువచ్చినందుకు విమర్శలు వెల్లువెత్తాయి. కానీ చిన్న పిల్లలని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి పంపించేసినందుకు నారా లోకేష్‌ పట్ల ప్రజలలో గౌరవం పెరిగింది.

వైసీపీ-టీడీపీలకు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌-జగన్‌ మద్య ఏ విషయంలోనైనా ఎప్పుడూ ఇలాగే తేడా కనిపిస్తుంటుంది.

ADVERTISEMENT
Latest Stories