అటు వైపు తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ ఏమో ఏపీ రాజకీయాలకు, మాకు సంబంధం ఏమిటని చెప్తుంటే, మరో వైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏమో హైదరాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన చేస్తున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఏం అభివృద్ధి చేసారంటే, బహుశా ఏ ఒక్క అంశం కూడా కనపడదేమో గానీ, హైదరాబాద్ అభివృద్ధిలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు.
2014లో విభజన జరిగిన తర్వాత ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో విజయవంతం అయ్యింది. ఎస్.ఆర్/ఏం., ఎన్.ఐ.టి వంటి ప్రముఖ విద్యాసంస్థలతో పాటు హెచ్.సి.ఎల్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను ఏపీలోకి తీసుకువచ్చిన చంద్రబాబు సర్కార్ కియా వంటి కార్ల సంస్థను ఏపీలోకి తీసుకువచ్చింది.
అలాగే శ్రీ సిటీలో నెలకొల్పిన ఎలక్ట్రానిక్ సంస్థలకైతే కొదవలేదు. ఇవన్నీ కాక లూలూ వంటి మరెన్నో సంస్థలతో ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఇదంతా 2014 నుండి 2019 ఎన్నికల ముందు వరకు జరిగిన విషయం. 2019లో జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన తర్వాత ఏపీ ముఖచిత్రం మారిపోయింది. అప్పటివరకు ఏపీ ముఖం చూసిన ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఒక్కసారిగా ఏపీని వదలడం మొదలయ్యింది.
ఆ క్రమంలోనే ఏపీ నుండి వీడిపోయిన తెలంగాణకు ముఖ కేంద్రమైన హైదరాబాద్ కు పెట్టుబడుల వరద ప్రారంభమయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే అంతకంతకూ పెరుగుతూ పోతోన్న హైదరాబాద్ నగర విస్తరణలో కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టిందో గానీ, ఏపీలో జగన్ చేపట్టిన చర్యలతో మాత్రం విపరీతమైన అభివృద్ధి దిశగా హైదరాబాద్ పరుగులు పెడుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా కేటీఆర్ ఓపెన్ చేసిన లూలూ మాల్!
నిజానికి లూలూ మాల్ తో చంద్రబాబు సర్కార్ పెట్టుబడుల దిశగా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియాలోనే అతి పెద్ద మాల్ ని విశాఖలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల రీత్యా లూలూ మాల్ విశాఖ నుండి వెనక్కి తగ్గి హైదరాబాద్ కు చేరుకుంది. దానినే బుధవారం నాడు కేటీఆర్ గారు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ క్రెడిట్ నిజానికి కేసీఆర్ సర్కార్ జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ అభివృద్ధిలో జగన్ మోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. నిజానికి ఇదే భావన తెలంగాణా ప్రజలలోనూ వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికలలో కూడా జగన్ మోహన్ రెడ్డి ఏపీలోకి అధికారంలోకి రావాలన్న భావన తెలంగాణలోని చాలా మంది వెలిబుచ్చుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



