నేడు వైసీపీ అధినేత, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. కనుక ముందుగా ప్రజల తరపున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రెండు రోజులు ముందుగానే జగన్, వైసీపీ నేతల ఫోటోలతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టుకున్నారు. అధినేత పుట్టినరోజు సందర్భంగా నేడు వైసీపీ నేతలు, కార్యకర్తలు కేకులు కట్ చేసి ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు.
అధినేత పట్ల వారి అభిమానానికి చాలా సంతోషం. ‘రప్పా రప్పా’ అనకుండా వారు ఈ వేడుకలు జరుపుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ వైసీపీ కార్యక్రమం అంటేనే ఏదో ఓ వివాదం తప్పనిసరన్నట్లు మారింది. తాడేపల్లిలో జగన్ నివాసానికి సమీపంలో ఓ కటవుట్ ఇందుకు నిదర్శనం. దానిలో జగన్, ఆయన వెనక కేసీఆర్, కేటీఆర్ బొమ్మలు కూడా పెట్టారు!
జగన్, కేసీఆర్, కేటీఆర్ మద్య మంచి అనుబంధం ఉందని అందరికీ తెలుసు. కానీ వారి ఫోటోలు పెట్టడానికి ఇది తగిన స్థలం కాదు సందర్భమూ కాదు కదా?
అయినా రవీంద్ర భారతిలో బాలు విగ్రహం వద్దంటున్నప్పుడు, చంద్రబాబు నాయుడుని గద్దె దించి, ఏపీ రాజధాని అమరావతిని దారుణంగా దెబ్బ తీసి, పరిశ్రమలు, పెట్టుబడులు హైదరాబాద్ తరలించుకు పోయిన కేసీఆర్, కేటీఆర్ కటవుట్లు తాడేపల్లిలో పెట్టడం సిగ్గుచేటు కాదా?
ఈ ఒక్క కటవుట్ వైసీపీ-బీఆర్ఎస్ పార్టీల మద్య ఉన్న రహస్య అవగాహనకి నిలువెత్తు నిదర్శనంగా భావించవచ్చు.
తాను ఒంటరిగా సింహంలా పోరాడుతున్నానని, కానీ తన ఒక్కడిని ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ, జనసేన, బీజేపీలు మూడు పొత్తులు పెట్టుకున్నాయని అది రాజకీయ వ్యభిచారమే జగన్ వాదించేవారు. కానీ జగన్ చేసింది.. చేస్తున్నది ఏమిటి?
ఏపీని, ఆంధ్రా నాయకులను, చివరికి ఆంధ్రా సంస్కృతీ సంప్రదాయాలను కూడా తీవ్రంగా ద్వేషించే కేసీఆర్ వంటి వ్యక్తితో చేతులు కలిపారు! ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టినందుకు కృతజ్ఞతగా రాజదాని అమరావతిని, రాష్ట్రాభివృద్ధిని కూడా ఆయనకు తాకట్టు పెట్టేశారు కదా?
2028-29 ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోక తప్పదు. తమ వితాండవాదాలతో రాజకీయ ఏకాకులుగా మారిన ఈ రెండు పార్టీలకు అధికారంలోకి రావడానికి ఇదొక్కటే మార్గం.
కనుక 2019 నాటి కుట్రలు, కుతంత్రాలు తెర వెనక మళ్ళీ జరుగుతున్నా ఆశ్చర్యం లేదు. జగన్ నివాసం ముందు పెట్టిన ఈ కటవుట్ ఇందుకు నిలువెత్తు సాక్ష్యం కాదా?







