ఏ ప్రభుత్వానికైనా దాని పాలన గీటురాయిగా ఉంటుంది. దానిని బట్టే ఎన్నికలలో ప్రజలు తీర్పు చెపుతుంటారు. గత 5 ఏళ్ళ జగన్ పాలనలో అన్ని రంగాలలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెట్టి అదే తాను ప్రజలకు చేసిన మేలు అని జగన్‌తో సహా ఆ పార్టీ నేతలు నిసిగ్గుగా చెప్పుకునేవారు.
“అన్ని లక్షల కోట్లు పంచిపెట్టినా జగన్ ఎలా ఓడిపోయారో?”అంటూ ఆయన శ్రేయోభిలాషి కేటీఆర్ ఆశ్చర్యపోయారు కూడా. కానీ జగన్ పాలన ఎంత దారుణంగా ఉండేదో పలు సందర్భాలలో కేటీఆర్ స్వయంగా చెప్పేవారు. ఒకప్పుడు దేశంలో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలలో మాత్రమే ఇంత దారుణమైన పాలన ఉండేది.
ఇప్పుడు ఆ రాష్ట్రాలలో కూడా పాలన సవ్యంగానే సాగుతోంది. కానీ 5 ఏళ్ళ జగన్ పాలన వాటికంటే దారుణంగా సాగింది. అందుకే ప్రజలు ఏకగ్రీవంగా జగన్‌ని తిరస్కరించారు. తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో జగన్‌కి కూడా తెలుసు.
కానీ “అవ్వతాతయ్యలు, అక్కా చెల్లెమ్మలు నన్ను ఎందుకు వద్దనుకున్నారో?అంటూ నిటూర్పు విడిచి చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మోసపోయారు,” అని తనను తాను మభ్యపెట్టుకొని, పార్టీ నేతలను, ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ అప్పుడే వైసీపి మనసాక్షి “దేశంలో ఇంత దారుణమైన పాలన ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టారో కానీ నెల రోజులలోనే రాష్ట్రంలో రాజకీయ వేధింపులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో పరిస్థితులను చూసీ చూడన్నట్లు ఊరుకుంటోంది.
చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతుడు కనుకనే నాలుగుసార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక ప్రజలకు మేలు చేస్తే మంచిదే కానీ అహంభావంతో తాను ఏమి చేసినా చెల్లుతుందని పాలనను గాలికొదిలేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉందా లేదా? అనే అనుమానం కలుగుతోంది…” అంటూ వైసీపి కడుపు మంటని మీడియా పేరుతో సాక్షి వెళ్ళగక్కింది.
నేడు వైసీపి నేతలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ స్వయంకృతాపరాధాలే. వాటి పర్యవసనాలనే వారు అనుభవిస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ జరగడం లేదు. దానినే వారు శాంతిభద్రతల సమస్యగా చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు పాలనకు అప్పుడే ‘జీరో’ మార్కులు వేస్తున్నారు కూడా.
అయితే విశాఖని రాజధాని చేస్తామంటూ కాకమ్మ కధలు చెప్పిన జగన్, ఋషికొండపై 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్ కట్టుకున్నారు తప్పితే విశాఖకు చేసింది ఏమీ లేదు.
కానీ చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే విశాఖకు వచ్చి నగర అభివృద్ధి, మెట్రో బీచ్ కారిడార్, పరిశ్రమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించుకు వచ్చేందుకు నెల రోజులలోనే నేడు మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. కేవలం నెల రోజులలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మార్పులు మొదలయ్యాయి. అవన్నీ కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పరదాలు తొలగించేసినా జగన్, ఆయన సొంత మీడియాకు మాత్రం అవి కనబడటం లేదు!
జగన్ అధికారంలో ఉన్నంత కాలం హిరణ్య కశిపుడులా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల నామస్మరణ చేస్తూనే కాలక్షేపం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు. అందుకే జగన్ అడగకుండానే కేసుల వరాలు లభిస్తున్నాయి.
ఇప్పటికైనా వైసీపి ఓటమికి, ఈ కేసులకు తన విపరీత ధోరణే కారణమని జగన్ గ్రహించలేదు. కనీసం వైసీపి నేతలు కూడా అంగీకరించడం లేదు. దాని వలన నష్టపోయేది వారే. కనుక ఇది కూడా వారి దౌర్భాగ్యమే కదా?




