మరి ఆధికారిణిని ఎందుకు సస్పెండ్ చేసినట్లు?

YS Jagan Convoy - Ongole - Vemala- Srinivasపల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన భార్య, పిల్లలతో ఇన్నోవా కారులో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతూ బుదవారం రాత్రి దారిలో ఒంగోలు బస్టాండ్ వద్ద ఆగి టిఫిన్స్ చేస్తుండగా, హోంగార్డు తిరుపాల్ రెడ్డి వచ్చి సిఎం కాన్వాయ్ కోసం వారి కారును పట్టుకుపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం అధికారులు ఒంగోలు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంధ్యను సస్పెండ్ చేసి, రవాణాశాఖలో పనిచేస్తున్న హోంగార్డు తిరుపాల్ రెడ్డిని పోలీస్ శాఖకు సరండర్ చేశారు. తరువాత అధికారులు ఇన్నోవా కారును యజమానికి అప్పగించారు.

అయితే ఇంత జరిగిన తరువాత ప్రకాశం జిల్లా ఉప రవాణా కమీషనర్‌ శ్రీకృష్ణవేణి జరిగిన పొరపాటును ఇంకా సమర్ధించుకొంటున్నట్లు మాట్లాడటం విశేషం. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా మేము కాన్వాయ్ కోసం వాహనాలను ఏర్పాటు చేస్తున్నాము. మా జిల్లా వెనుకబడిన జిల్లా కనుక ప్రైవేట్ ట్రావెల్స్ వద్ద తగినన్ని మంచి వాహనాలు లేకపోవడంతో మా పరిచయాలను ఉపయోగించుకొని కొందరి నుంచి వాహనాలను సేకరిస్తున్నాము. బుదవారం రాత్రి ఇన్నోవా కారు యజమానికి మా వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కి మద్య చిన్న సమాచారలోపం వలన ఈ పొరపాటు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. వారు ప్రయాణిస్తున్న వాహనానికి ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడం వలన దానిలో ప్రయాణిస్తే వారికి ప్రమాదమని భావించి మా వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ దానిని స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత ఆ కుటుంబం వేరే కారులో తిరుమలకు వెళ్ళిపోయింది. మర్నాడు మా అధికారులు వారికి ఆ కారును అప్పజెప్పి ఫిట్‌నెస్ సరిచేయించుకోవాలని చెప్పారు. ఇది కేవలం సమాచార లోపం వలన మాత్రమే జరిగింది తప్ప వేరే కాదు,” అని అన్నారు.

ADVERTISEMENT

వేముల శ్రీనివాస్ కుటుంబం నుంచి స్వాధీనం చేసుకొన్న కారు ఏదో డొక్కు కారు కాదు. మంచి కండిషన్‌లో ఉన్న ఇన్నోవా కారు. ఫోటో చూస్తేనే ఆ సంగతి అర్ధమవుతోంది. ఒకవేళ దానికి ఫిట్‌నెస్ లేకపోతే ఆయన తన భార్య, పిల్లలతో దానిలో తిరుమల ఘాట్ రోడ్డులో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేయరు కదా?ఒకవేళ వారు ప్రయాణిస్తున్న కారుకి ఫిట్‌నెస్ లేదని వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ నిర్ధారించి, దానిని ఆమె స్వాధీనం చేసుకొంటే ఆమె తన డ్యూటీ సక్రమంగా చేశారనే కదా? కానీ ప్రభుత్వం ఆమెను ఎందుకు సస్పెండ్ చేసినట్లు? హోంగార్డుని పోలీస్ శాఖకు ఎందుకు సరెండర్ చేసినట్లు? పొరపాటు జరిగిందనే కదా?అయినా మళ్ళీ ఈవిదంగా జరిగిన పొరపాటును గుడ్డిగా సమర్ధించుకోవడం ఎందుకు?జరిగినదంతా చూసిన రాష్ట్ర ప్రజలు ఈ మాత్రం కూడా అర్ధం చేసుకోలేరనా?

ADVERTISEMENT
Latest Stories