ఏపీలో ఏ వర్గానైనా దారికి తెచ్చుకోవాలంటే జగన్ సర్కార్ ముందుగా ఓ సమస్యను సృష్టిస్తుంది. దాంతో సంబందిత వర్గం ఆ సమస్యలను ఎదుర్కోలేక వారంతట వారే కాళ్ళ బేరానికి వచ్చేలా చేస్తుంది. ఇదీ… జగన్ సర్కార్ కనిపెట్టి మూడున్నరేళ్ళుగా విజయవంతంగా అమలుచేస్తున్న విధానం.
ఉదాహరణకు రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను దారికి తెచ్చుకొంది. ఆ తర్వాత టికెట్ ధరలు తగ్గించడం, థియేటర్లపై ఆంక్షలు విధించి మెగాస్టార్ చిరంజీవితో సహా ఇండస్ట్రీలో పెద్ద నటులు, నిర్మాతలు తన ముందు చేతులు జోడించి ప్రాధేయపడేలా చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ‘ఛలో విజయవాడ’ నిర్వహించాలనుకొన్నప్పుడు జగన్ సర్కార్ వద్దని చెప్పింది. అయినా వారు వినలేదు. లక్ష మందితో నిర్వహించి గొప్పగా భుజాలు చరుచుకొన్నారు. ఇప్పుడు దానికి ‘అటెండన్స్ శిక్ష’ అనుభవిస్తున్నారు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి హటాత్తుగా పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి పెరిగింది. రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువా అన్నట్లు దాంతో ఫ్లెక్సీ బ్యానర్లపై నిషేధం విదించేసింది.
దీనిపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత వంగలపూడి ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఈ ప్లాస్టిక్స్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకు తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వరకు ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?” అని సందేహం వ్యక్తం చేశారు.
“రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగూ పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి…” అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వరుసగా ట్వీట్స్ పెట్టారు.
1) రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి (cont..)
— Pawan Kalyan (@PawanKalyan) August 27, 2022
జగన్ సర్కార్‌కి నిజంగా పర్యావరణంపై ప్రేమ పుట్టుకొస్తే చాలా సంతోషమే. పవన్ కళ్యాణ్ సూచించినట్లు కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న ఆ పరిశ్రమలపై ముందుగా జగన్ సర్కార్ దృష్టి పెట్టాలి కానీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు ఫ్లెక్సీ బ్యానర్లపై నిషేధం విధించింది. ఆ నిర్ణయంలో పర్యావరణాన్ని కాపాడాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు కనుకనే దీనిని అనుమానించవలసివస్తోంది.
ఇటువంటి నిర్ణయాలతో అహం చల్లరుతుందేమో కానీ ప్రజల దృష్టిలో ప్రతిష్ట మరింత మసకబారుతుందని, ఆయా వర్గాలు తన ప్రభుత్వానికి, పార్టీకి శత్రువులుగా మార్చుకొంటున్నామని జగన్ సర్కార్ గ్రహించడంలేదు. కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు ఇదీ ఒకందుకు మంచిదేనేమో?
—



