ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1.6 లక్షల మందికి పించన్నిలిపివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపిస్తోందని మీడియాలో వస్తున్న వార్తలపై సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి రూ.590.91 కోట్లు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ “పింఛనులు తొలగిస్తున్నామంటూ ప్రతిపక్ష అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్ అందించాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. కనుక ప్రతీ ఆరు నెలలకి ఓసారి ఆడిట్ చేస్తుంటాము. దానిలో భాగంగా రీ-వెరిఫికేషన్ కోసం లబ్దిదారులకి నోటీసులు పంపిస్తుంటే, పింఛనులు తొలగిస్తూ నోటీసులు పంపిస్తున్నామని ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో పింఛన్ బిల్లు నెలకి రూ.400 కోట్లు మాత్రమే కాగా ఇప్పుడు నెలకి రూ.1,770 కోట్లు. గత ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున 39 లక్షల మందికి మాత్రమే చెల్లిస్తే మా ప్రభుత్వం నెలకు రూ.2,750 చొప్పున 62 లక్షల మందికి చెల్లిస్తోంది. ఇంత మంచి చేస్తున్నా జరగకూడనిదేదో జరిగిపోతోందన్నట్లు ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. దీనిని జిల్లా కలెక్టర్లు గట్టిగా తిప్పి కొట్టాలి,” అని అన్నారు.
ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని అనుకొన్నా, నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, పింఛనులు తొలగిస్తున్నట్లు తెలిసిందని, ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రతీరోజు అనేకమంది తన వద్దకి వచ్చి దీనిపై ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. అంటే ఆయన కూడా అబద్దం చెపుతున్నారనుకోవాలా?తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా?
రీ-వెరిఫికేషన్ చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ ఆ వంకతో నిబందనల పేరుతో పింఛన్లు తొలగించడాన్నే ప్రతిపక్షాలు, మీడియా తప్పు పడుతున్నాయి. అలా చెపుతున్నందుకు సిఎం జగన్మోహన్ రెడ్డి వాటిపై ‘చెడు వ్యవస్థలు’ అని ముద్ర వేసేశారు.



