రాష్ట్రాభివృద్ధికి దశదిశ నిర్ణయించే బడ్జెట్ సమావేశాలు ముఖ్యమంత్రికి ఎంత ముఖ్యమో, తాజా మాజీకి కూడా అంతే ముఖ్యమని వేరే చెప్పక్కరలేదు. అయితే మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి తన ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్ళిపోయారు…. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ గురువారం ఢిల్లీలో ధర్నా చేయడానికి!
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల కంటే ఢిల్లీలో ధర్నా చేయడమే ముఖ్యమా?అంటే కాదనే చెప్పవచ్చు. కానీ శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా తప్పించుకునేందుకే ధర్నా పేరుతో ఢిల్లీకి పారిపోయారని టిడిపి శాసనసభ సభ్యుల వాదనలను కాదనలేము.
టిడిపి సభ్యులు సరే… సొంత చెల్లి వైఎస్ షర్మిల కూడా అన్న ఢిల్లీ ధర్నాని తప్పు పట్టారు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ, “జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం హత్యా రాజకీయాలు చేశారు, ప్రోత్సహించారు. బాబాయ్ వివేకాందరెడ్డిని హత్య చేసిన హంతకులను కాపాడుతూ వారితో కలిసి తిరుగుతున్నారు.
అయినా ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే వాటికి హాజరు కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అత్యవసరం ఏమిటి? అందుకేనా పులివెందుల ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు?జగన్ శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోగా తమ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీయకపోవడం ఇంకా తప్పు.
ఒకవేళ జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటే ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయాలి. బాబాయ్ వివేకానంద రెడ్డి కుటుంబానికి సీబీఐ న్యాయం చేయాలని ధర్నా చేయాలి. చేశారా లేదే?
పోలవరం నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని ఢిల్లీలో ధర్నా చేయాలి. విభజన హామీలు అమలు చేయమని కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలి. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించమని ధర్నా చేయాలి. కానీ వీటి కోసం ఎప్పుడైనా జగన్ ఢిల్లీలో ధర్నా చేశారా… లేదే?
కానీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టి ఢిల్లీలో ధర్నా చేయడం సిగ్గుచేటు! అంటూ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. నిజమే కదా?
జగన్ ఎప్పుడూ తన కేసులు, తన సమస్యలు, తన పార్టీ ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాని ప్రయోజనాల కోసం ఎన్నడూ ఆలోచించలేదు.
ఫర్నీచర్ దొంగ అంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. తన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజుని అరికాళ్ళు వాచిపోయేలా కొట్టించారు.
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఉందని చెప్పినందుకు డాక్టర్ సుధాకర్‌ని నడిరోడ్డుపై బట్టలు విప్పించి, దారుణంగా అవమానించారు. మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ అవమానం, వేధింపులు, మానసిక క్షోభ భరించలేకనే ఆయన గుండెపోటుతో చనిపోయారు.
వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే దళితయువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు.
ఇవేవీ జగన్‌కు తప్పుగా అనిపించలేదు. కానీ వినుకొండలో ఓ వైసీపి కార్యకర్తని మరో వైసీపి కార్యకర్త హత్య చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వితండవాదం చేస్తూ ఢిల్లీలో ధర్నాకు సిద్దం అవుతున్నారు… సిగ్గుచేటు కాదా?




