అక్కడ కేసీఆర్‌, ఇక్కడ జగన్‌… బీజేపీకి ఎసరు?

YS Jagan KCRమోడీ, అమిత్ షాలు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను వాటి అవినీతి కేసులు, బలహీనతలతో గుప్పెట్లో పెట్టుకొని ఆటాడిస్తుంటారని విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం గుప్పెట్లో చిక్కుకొన్నట్లు పైకి కనిపిస్తూనే, రాష్ట్రాలలో బీజేపీ విశ్వసనీయతను దెబ్బ తీస్తూ రాజకీయంగా బలపడకుండా, ఎదగకుండా చేస్తుండటం విశేషం.

ADVERTISEMENT

ఒకప్పుడు కేసీఆర్‌, మోడీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతూ తెలంగాణలో బీజేపీ విమర్శలను ప్రజలు నమ్మలేని పరిస్థితి కల్పించారు. రాష్ట్రంలో బీజేపీ తమపై కత్తులు దూస్తున్నా కేసీఆర్‌ పట్టించుకొనేవారు కారు. కేంద్రానికి అవసరమైనపుడల్లా పార్లమెంటులో మద్దతు ఇస్తుండేవారు. ఈవిదంగా కేసీఆర్‌ బీజేపీ అధిష్టానంతో స్నేహపూర్వకంగా మెసులుతూ తెలంగాణలో బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీశారు.

ఆ తర్వాత కేసీఆర్‌ మోడీపై కత్తులు దూస్తూ యుద్ధం ప్రారంభించారు. అప్పుడు కూతురు కల్వకుంట్ల కవిత కేసు విచారణ వేగవంతం కాగానే కేసీఆర్‌ వెనక్కు తగ్గేవారు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గేది.

ఈవిదంగాకూడా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య ఏదో రహస్య అవగాహన ఉందనే అనుమానం ప్రజలలో కలిగిస్తూ రాష్ట్ర స్థాయిలో బీజేపీ విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారు.

ఓ వైపు బీజేపీని దారుణంగా దెబ్బ తీస్తూనే కేంద్ర ప్రభుత్వం తమని వేదిస్తోందని, తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని గట్టిగా ప్రచారం చేస్తూ ఎదురుదాడి కూడా చేస్తుంటారు. ఈ వాదనలతో కూడా తెలంగాణలో బీజేపీని రాష్ట్రంలో బలంగా ఎదగనీయకుండా అడ్డుకట్టవేసింది.

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా ఏపీ బీజేపీ విమర్శలను పట్టించుకోకుండా మోడీ, అమిత్ షాల పట్ల వీరవిధేయంగా ఉంటారు. కేంద్రం కోరక ముందే పార్లమెంటులో మద్దతు ఇస్తుంటారు. నెలనెలా ఢిల్లీ వెళ్ళి మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి ఆ ఫోటోలు మీడియాలో వచ్చేలా చూసుకొంటారు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకొంటారు. ఇవన్నీ ఏపీలో బీజేపీ విశ్వసనీయతను దెబ్బ తీసేవే అని వేరే చెప్పక్కరలేదు.

కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి తమ గుప్పెట్లో ఉన్నారని కేంద్రం అనుకొంటుంటే, వారివురూ దానిని ఆ భ్రమలోనే ఉంచుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీని ఎదగనీయకుండా నిలువరించగలుగుతున్నారు. ఈ విషయం మోడీ, అమిత్ షాలకు తెలియదనుకోలేము. అయితే వారికి ఏపీ, తెలంగాణలలో బీజేపీ అధికారం చేపట్టడం కంటే, కేంద్రంలో తాము అధికారంలో కొనసాగడమే ముఖ్యమని భావిస్తుంటారు. అందుకే రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు బీజేపీని దెబ్బతీస్తూ ఎదగనీయకుండా అడ్డుకొంటున్నా పెద్దగా పట్టించుకోరు. బీజేపీ అధిష్టానం ఈ ధోరణే రాష్ట్ర బీజేపీలకు శాపంగా, బిఆర్ఎస్, వైసీపిలకు వరంగా మారిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories