కేటీఆర్ ని కలిసి తొందరపడ్డామా జగన్ లో అంతర్మధనం

KTR-TRS-YS Jaganచంద్రబాబు నాయుడుని గద్దె దించి తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి. నిన్న జగన్ ని కలిసిన కేటీఆర్ కేసీఆర్ స్థాపించిన ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తమ ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబును ఓడించడానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ కు భరోసా ఇచ్చారు కేటీఆర్. ఈ భేటీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది.

ADVERTISEMENT

తెలుగుదేశం పార్టీ ఉన్నఫళంగా వైకాపాపై ముప్పేట దాడి చేసింది. ఆంధ్ర వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు అంటూ విరుచుకుపడింది. అధినాయకత్వం నుండి ఈ కీలక పరిణామం గురించి సరైన సమాచారం లేకపోవడంతో వైకాపా నేతలందరూ మీడియాలో పార్టీ స్టాండును గట్టిగా చెప్పలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేసీఆర్ కలగచేసుకుంటారని కొందరు, లేదు జాతీయ రాజకీయాలలలో మద్దతు వరకే అని ఇంకొందరూ పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు. ఈలోగా ఇంగ్లాండ్ హాలిడేకి వెళ్ళారు జగన్ మోహన్ రెడ్డి.

తాను వచ్చే లోపు అన్ని జిల్లాల నుండి ఈ సరికొత్త స్నేహంపై ప్రజల రియాక్షన్ ను తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ టీమ్ కు, పార్టీ నాయకులను ఆదేశించారు జగన్. ఆయన 22న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చాకా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి డైరెక్టుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. విజయవాడలో గానీ కడపలో గానీ ఈ మీటింగు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. సర్వే నివేదిక వ్యతిరేకంగా వస్తే ఈ మీటింగు రద్దు అయ్యి తెర వెనుకనే స్నేహం కుదిరేలా చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం.

తెలంగాణాలో తెరాసకు అత్యధిక మెజారిటీ రావడానికి కారణం అక్కడి ప్రజలు చంద్రబాబు ప్రమేయాన్ని తట్టుకోలేకపోయారని విమర్శకుల అభిప్రాయం. ఈ క్రమంలో ఏపీ ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తే జగన్ ఏమైపోతారో? ఎవరో కొందరు వైకాపా అభిమానులు, కులం బట్టి ముందుకు పోయే వారు కేసీఆర్ ఏపీ వచ్చినప్పుడు చేసే హడావిడి చూసి వాపుని బలుపు అనుకుంటున్నారు జగన్. ఇది తేడా అయితే ఎన్నికల ముందు జగన్ అతిపెద్ద సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories