హమ్మయ్య! సదస్సులో చెప్పుకోవడానికి ఓ పాయింట్ దొరికింది

YS_Jagan_Mohan_Reddy_in_Davosదావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి బృందం ఒక్క పైసా పెట్టుబడి కూడా సాధించలేకపోయారు. నేడు రెండో రోజున సిఎం జగన్మోహన్ రెడ్డి ‘ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌’ అనే అంశంపై ప్రసంగించారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసుకొంది? ఏవిదంగా కరోనా కట్టడికి కృషి చేసింది?తదితర అంశాలపై సిఎం జగన్మోహన్ రెడ్డి అనర్గళంగా ఉపన్యసించారు.

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం, దాంతో పేద ప్రజలకు ఏవిదంగా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్నదీ వివరించారు. ఏపీలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, వాటిలో వైద్య సదుపాయాలు, మారుమూల గ్రామాలకు సైతం 104, 108 అంబులెన్స్ సేవలందిస్తున్నట్లు చెప్పారు.

ADVERTISEMENT

ఏపీలో పేద ప్రజలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇదివరకు రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఉండగా ఇప్పుడు మరో 16 కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నిజమే… ఏపీలో వేలాదిమంది ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది రేయింబవళ్ళు పనిచేయడం వలననే కరోనా కట్టడిలోకి వచ్చింది. ఆ క్రెడిట్ మొత్తం వారిదే. అయితే వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో పనిచేస్తుంటారు కనుక ఆ క్రెడిట్‌ని సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా స్థాయి ఆసుపత్రులు ఉన్నాయి. కానీ అవి సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. చాలా దశాబ్ధాలుగానే ఉన్నాయి. కానీ ఓ బలమైన వైద్య వ్యవస్థ ఉందనేది వాస్తవం. వాటి నిర్వహణ లోపాలు గురించి తరచూ వార్తలలో వస్తూనే ఉంటాయి. ఆ మద్యన విశాఖలోని డాక్టర్ సుధాకర్ రావు వాటి గురించి మాట్లాడినందుకు ఆయనకి ఏ గతి పట్టిందో అందరూ చూసే ఉంటారు. అది వేరే సంగతి.

వాటికి అనుబందంగా పనిచేసే 104,108 అంబులెన్సులు కూడా ఉన్నాయి. కానీ నేటికీ మారుమూల ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీలను డోలీ లేదా మంచాలపైకి తీసుకు వస్తున్న వార్తలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు లేకపోవడం లేదా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు మరణిస్తున్న వార్తలను చూస్తూనే ఉన్నాము. ఇటీవల తిరుపతి, నెల్లూరు జిల్లా ఆస్పత్రులలో మరణించిన పిల్లలను స్వగ్రామానికి తరలించడానికి అంబులెన్సులు లేకపోవడం లేదా ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితుల వలన మోటార్ బైక్‌లపై తరలించిన విషయం అందరూ చూశారు.

ఆరోగ్యశ్రీ పధకం అమలవుతోంది. కానీ వాటికి బిల్లులు చెల్లింపులలో ఆలస్యం అవుతుండటంతో ఆస్పత్రులలో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఇంకా నిర్మించలేదు. నిర్మించబోతున్నారు. మిగిలిన ఈ రెండేళ్ళలో నిర్మించగలిగితే సంతోషమే. ఒకవేళ అధికార పార్టీ నేతలకు చెందినవైతే తప్పకుండా పూర్తవుతాయి.

వ్యవస్థలలో తప్పులు, లోపాలు దొర్లితే గత ప్రభుత్వాన్ని నిందించే సిఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో ఏర్పాటు బలమైన వైద్య వ్యవస్థ క్రెడిట్ అంతా తనదే అన్నట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లు. అయినప్పటికీ ఈ ప్రసంగంతో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి వచ్చినా అందరికీ చాలా సంతోషమే.

ADVERTISEMENT
Latest Stories