YS Jagan Mohan Reddyరోజు గడిస్తే మళ్ళీ ఏ కొత్త పన్ను వచ్చి మా మీద పడుతుందోనని భావించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వంతవుతోంది. ఇప్పటికే వివిధ రకాల పన్నులతో ప్రజల తలకు బొప్పి కట్టించిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మరో కొత్త బాదుడుకు శ్రీకారం చుట్టింది.

‘వన్ టైం సెటిల్మెంట్’ (OTS) తరహాలో ‘వన్ టైం కన్వర్షన్’ (OTC)ను ప్రవేశపెట్టింది. వ్యవసాయ భూముల్లో నిర్మాణాలపై నాలా వసూలు, పెనాల్టీ వసూలుకు రంగం సిద్ధం చేసింది. పెనాల్టీ కట్టి క్రమబద్దీకరించుకోని నేపథ్యంలో… ప్రభుత్వ చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందన్న హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

ఇప్పటికే వీటికి సంబంధించిన డేటాను ప్రభుత్వం సేకరించింది. త్వరలోనే వీరికి నోటీసులు కూడా పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారట. ఈ OTC వసూలు బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుతం అప్పగించింది. ఈ OTC ఫీజు మరియు పెనాల్టీ భారీ స్థాయిలో ఉండడమే అసలు ట్విస్ట్.

ప్రభుత్వం ప్రకారం ఉన్న భూమి యొక్క విలువలో నాలా ఫీజు రూపంలో 5% మరియు పెనాల్టీ రూపంలో ఇంకో 5 శాతంగా నిర్ణయించింది. వ్యవసాయ భూములలో నిర్మాణం ఎప్పుడు కట్టినా వర్తించేలా మరియు పురాతన కట్టడాలకు సైతం మినహాయింపు లేదని అధికారులు చెప్తున్నట్లుగా టీవీ5 ప్రసారం చేసిన కధనం సంచలనమైంది.