YS-Jagan Mohan Reddy Andhra Pradesh Chief Ministerమన దేశ రాజకీయాలు మతం ఆధారంగానో లేక కులం చుట్టూనో తిరుగుతూ ఉంటాయనేది బహిరంగ సత్యం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలైతే కులం ఆధారితంగానే రాజకీయాలు చేస్తాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన పిదప ఈ కుల ఆధారిత రాజకీయాలు నానాటికి తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అవి ఏ స్థాయికి వచ్చాయంటే… సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబును ‘సామాజిక వర్గం’ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా పత్రికా ముఖంగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.

“యధా రాజా తధా ప్రజా” అన్న తీరుగానే ఉంటుంది రాష్ట్ర మంత్రివర్యుల వ్యవహార శైలి కూడా! టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి సామాజిక వర్గం వారికే ఉన్నత పదవులు కేటాయిస్తున్నారని… ఉద్యోగుల పదోన్నతి విషయంలో కూడా తమ సామాజికవర్గం వారికే కొమ్ము కాసారని.., బడ్జెట్ నిధుల కేటాయింపులలో కూడా బలహీన వర్గానికి నిధుల మంజూరు విషయంలో అన్యాయం జరుగుతోందని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నాయకులు.

వీటన్నింటికి ‘శుభంకార్డు’ వేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ‘జగన్ అండ్ కో’ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే నాడు టీడీపీపై ఎలాంటి విమర్శలైతే చేసారో, ప్రస్తుతం “అంతకు మించిన” స్థాయిలో ప్రతిపక్ష పార్టీల నుండి వైసీపీ నేతలు ప్రతిస్పందన ఎదుర్కొంటున్నారు. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారిపై ఉన్న కక్షతోనే రాష్ట్ర రాజధానిలో ఉన్న దళితులకు, బలహీన వర్గాలకు చెందిన వారిపై కూడా ఉక్కు పాదం మోపారని జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక రాష్ట్ర ఆర్ధిక మంత్రివర్యులు బుగ్గన తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు చూస్తే చాలు “జగన్ సామాజిక న్యాయం” ఏమిటో అవగతమవుతుందని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. కులం ఆధారంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు కేటాయించిన నిధులలో ఈ విషయం స్పష్టమవుతోందని, ప్రభుత్వం వైఖరి క్లియర్ కట్ గా కనపడుతోందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో 5% నుండి 7% నడుమ ఉండే జగన్ సొంత సామాజిక వర్గానికి 3088.99 కోట్లు కేటాయించగా, దాదాపుగా 30% ఉన్న కాపు సామాజిక వర్గానికి 3531.68 కోట్లు కేటాయింపులు చేసింది. అలాగే జగన్ సామాజిక వర్గానికి కాస్త అటు ఇటుగా ఉన్న 4.5% ఉండే చంద్రబాబు సామాజిక వర్గానికి 1899.74 కోట్లు., ఆర్య వైశ్య కార్పొరేషన్ కు 885 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ కు 377 కోట్లు, క్రైస్తవానికి 11.34 కోట్లు., 7% ఉన్న మైనారిటీస్ కు 1750.50 కోట్లు వైసీపీ సర్కార్ కేటాయింపులు చేసింది.

ఈ చిట్టా పొద్దులు గమనించిన ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది ఏ కులానికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారో అని! బుగ్గన ఇచ్చిన పద్దులనే ప్రజలకు చూపించి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని ప్రతిపక్ష పార్టీలు అన్ని విమర్శల దాడిని షురూ చేసుకుంటున్నాయి. కేవలం బడ్జెట్ విషయాలలోనే కాదు, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులన్నీ వారి సామాజిక వర్గం వారికే కేటాయించిన వైనాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ వర్గాలు ఏకరువు పెడుతున్నాయి.

ఇప్పుడు చెప్పండి జగన్ గారు…! ఇదేనా మీ “సమన్యాయం… సామాజిక న్యాయం” అంటూ టీడీపీ నేతలతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు., రాజకీయ విమర్శకులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే… “ప్రజలు మారాలని రాజకీయ నాయకులు., రాజకీయ నాయకులే మారాలని ప్రజలు.,” ఆలోచించినంత కాలం దేశ ప్రగతి మారదు. తరాలు గడుస్తున్నా ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోవడానికి కారణం ఈ రాజకీయ నాయకులు నమ్మబలికే “సామాజిక న్యాయమే.” వాటిని గుడ్డిగా నమ్మే ప్రజానీకమే!