క్రియాశీలక రాజకీయాల్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం వెనుక ఉన్నదేవరూ? దీనికంతటికీ సూత్రధారి ప్రధాని నరేంద్ర మోడీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వీరెవరూ కాదు… వెంకయ్యను ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టింది జగన్ అంటోంది ‘సాక్షి’ మీడియా! ఆంధ్రజ్యోతి తక్కువ తిందా… వెంకయ్య హోదాకు కారణం లోకేష్ బాబు అంటోంది! వీరిద్దరూ ఇలా ఉంటే కేసీఆర్ పత్రిక వెనకడుగు వేస్తోందా… అసలు ఈ ఆలోచనకు కారణం కేటీఆరే అంటోంది!
నిజమా… వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయడం వెనుక జగన్, లోకేష్, కేటీఆర్లు ఉన్నారా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, గతంలో సదరు దినపత్రికలలో వారి గురించి ప్రచురించిన వార్తలను మార్చి వేసి, తాజాగా వెంకయ్య నాయుడు గురించి వ్యాఖ్యలు రాస్తూ…. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అత్యంత హాస్పాస్పదంగా మారిన ఈ క్రియేటివిటీని చూసి నెటిజన్లు నవ్వుకుంటూ… షేర్ చేసుకుంటుండడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది.
ఫోటోషాప్ లో ఎడిట్ చేస్తూ వదిలిన ఈ ఔత్సాహికుడు ఎవరో గానీ, ముగ్గురు యువనేతలను వదిలిపెట్టకుండా కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ఉన్నంతలో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఆర్టికల్ మరింత ఎటకారంగా ఉండడం విశేషం. చనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలో కనిపించారట… వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా సూచించమని చెప్పారట… దీంతో జగన్ అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పడం… అది తెలుసుకుని మోడీ ‘స్వాతిముత్యం’ అంటూ అభినందించడం… పీక్స్ లో ఉందంతే…!



