ఈ నెలన్నర రోజుల చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రంలో సుమారు 35 మందికి పైగా హత్య చేయబడ్డారని, ఇవన్నీ టిడిపి ప్రభుత్వం చేయించిన రాజకీయ హత్యలే అని వైసీపి నేతలు వాదిస్తున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపి కార్యకర్త షేక్ రషీద్ హత్య ఇందుకు తాజా నిదర్శనమంటూ జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు.
టిడిపి అరాచకాలను అడ్డుకోకపోతే రాష్ట్రానికి, ప్రజలకు చాలా ప్రమాదం ఏర్పడుతుందని కనుక తాను పోరాడి అడ్డుకట్ట వేస్తానన్నారు. ఆ ప్రయత్నంలోనే జగన్ నేడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చాటింపు వేసేందుకు సిద్దం అవుతున్నారు.
అయితే రాష్ట్రంలో 35 మందికి పైగా హత్య చేయబడ్డారని జగన్, వైసీపి నేతలు వారి మీడియా చెపుతోంది కనుక మృతుల వివరాలను కూడా చెప్పాలని టిడిపి నేతలు అడుగుతున్నారు. కానీ దానికి వైసీపి సమాధానం చెప్పడం లేదు. కనీసం మృతుల వివరాలను డిజిపికి ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చు. కానీ అదీ చేయలేదు.
శవరాజకీయాలు చేస్తూ వాటితో జగన్ రాజకీయ మైలేజి పొందాలని అనుకుంటున్నప్పుడు, ఆ పేరుతో ఓదార్పు యాత్రలు మొదలుపెట్టి మృతుల కుటుంబాలను పరామర్శించవచ్చు. కానీ ఒక్క రషీద్ కుటుంబాన్ని మాత్రమే పరామర్శించారు! అంటే జగన్, వైసీపి, వారి మీడియా చెపుతున్నావన్నీ కాకి లెక్కలేనా?అనే సందేహం కలుగుతోంది.
అయితే ఇదంతా కూడా జగన్ కొత్త వ్యూహంలో భాగమే అని చెప్పవచ్చు. ఎన్నికలలో వైసీపి ఓటమిపై నుంచి ప్రజలు, మీడియా చివరికి అధికార పార్టీల దృష్టిని మళ్ళించడానికే ఈ ప్రయత్నం. ఎన్నికలలో వైసీపి ఘోర పరాజయం కారణంగా జగన్ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రజల మద్యకు రాగలరు? అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా అనుకోవడం లేదు. జగన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు కూడా. అంటే తమ ఓటమిపై నుంచి అందరి దృష్టి మళ్ళించాలనే జగన్ వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు.




