ఓ పక్కన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్,’ మరో పక్కన ఈడీ రూపంలో తాజాగా వెలువడిన ఆస్తుల అటాచ్ మెంట్, ఇంకో వైపు ఇప్పటివరకు తన స్వరాన్ని తన మీడియా ద్వారా వినిపించి హంగామా చేసిన సాక్షి మూగబోతాయన్న సంకేతాలు, ఇలా ఏ దారి వెళ్ళినా చివరికి గోదారే అన్నట్లుగా దారులన్నీ మూసుకుపోతున్న తరుణంలో… నాలుగో దిక్కున కూడా జగన్ కు ఎదురుదెబ్బ తగలనుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
ఇప్పటివరకు 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. వీరిని వెనక్కి రప్పించేందుకు, లేదంటే వీరిపై అనర్హత వేటు వేసేందుకు ఏకంగా సుప్రీంకోర్టు గడప కూడా వైసీపీ తొక్కింది. అయితే ఆ 20 మంది ఎమ్మెల్యేల తర్వాత పెద్దగా కదలికలు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా వైసీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏకంగా జగన్ కొన్ని రోజుల పాటు లండన్ లో ఉన్నా, స్థానికంగా ఒక్క నేతలోనూ ప్రకంపనలు లేకపోవడంతో… పార్టీ పరంగా ఇంకా వైసీపీ నుండి ఫిరాయింపులు ఉండకపోవచ్చని భావించారు.
అయితే తాజాగా ఈడీ ఇచ్చిన షాక్ తో మళ్ళీ వైసీపీలో ముసలం ప్రారంభమైందని, ఏ సమయంలోనైనా జగన్ కు భారీ షాక్ తప్పకపోవచ్చన్న టాక్ మొదలైంది. ఈడీ ప్రక్రియ ముందుకు వెళితే జగన్ నివాసంతో పాటు, ఇప్పటివరకు వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న సాక్షి అడ్రస్ కూడా గల్లంతవుతుందన్న సమాచారంతో వైసీపీ నేతలు కొత్త దారుల వైపుకు చూడడం ప్రారంభించారన్నది ఈ వార్తల సారాంశం.
అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇది టిడిపి ‘మైండ్ గేమ్’ అంటుండగా, ఈ సారి టిడిపి వర్గాలు మాత్రం ‘మీరే చూడండి’ అన్నట్లుగా కాస్త మౌనం వహించడం విశేషం. చూడబోతుంటే ఈడీ ఇచ్చిన షాక్ నుండి జగన్ కోలుకునే పరిస్థితులు లేదన్నది రాజకీయ వర్గాలు అంతిమంగా తేలుస్తున్న మాట. ఇటీవల ప్రకటించిన ఈడీ ఆస్తుల అటాచ్ మెంట్ జరిగితే… ఏపీలో ప్రతిపక్షం కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.



