ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్నీతలు అనేది తేలిపోవడంతో అధికారంతో వచ్చిన అంధకారం వైసీపీ పొరలను కమ్మేసింది. ఇప్పుడు ఆ అధికారం దూరమవడంతో జగన్ కు ఒక్కసారిగా అలుముకున్న పొరలు వీడుతున్నాయి.
2014 ఎన్నికలలో గెలుపు అంచులదాకా వచ్చి ఓటమిని అందుకున్న వైస్ జగన్ గెలుపుకు ఓటమికి ఉన్న ఆ చిన్న వ్యత్యాసాన్ని చెరపడానికి, ప్రజలకు తనపై నమ్మకం కలిగించడానికి పాదయాత్రనే తన ఆయుధంగా ఎంచుకుని ప్రజల దగ్గరకు వెళ్లారు. తనతో పాటుగా తల్లి చెల్లిని కూడా తోడు తెచ్చుకున్నారు జగన్.
పాదయాత్రల పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసిన జగన్ ఎపుడు ప్రజల మధ్యే తన రాజకీయ జీవితం ఉండేలా చేసుకుని పేదలకు దగ్గరయ్యారు. అయితే యాత్రల ఫలితమో, సానుభూతి అస్త్రమో, తండ్రి వైస్సార్ చరిష్మా ప్రభావమో జగన్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు ఏపీ ప్రజలు.
అయితే ప్రజల మధ్య తిరిగి పదవి సంపాదించుకున్న జగన్ ముఖ్యమంత్రి కాగానే తన ముఖానికి ఉన్న పేదవాడి మాస్క్ తొలగించి పెత్తందారుని అవతారమెత్తారు. ఇక అనుకున్న లక్ష్యం నెరవేరింది ప్రజలతో తనకు అవసరం తీరింది అనుకున్న జగన్ ఐదేళ్లు తన తాడేపల్లి ప్యాలస్ గడప దాటలేదు.
తన అధికారంతో వ్యవస్థలనే కాదు ఏకంగా ఏడుకొండల వాడిని కూడా తన తాడేపల్లి ప్యాలస్ లోపలికి తెప్పించుకున్నారు జగన్. ఇక సామాన్యుడికి దూరంగా, పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా ఒక నియంత మాదిరి పాలన కొనసాగించిన జగన్ ఐదేళ్లలో ఏనాడూ ప్రజాసమస్యలను ఉద్దేశించి ప్రసంగించిందే లేదు.
పరదాలు సాయంతో ప్రజల మధ్యకు, అతి స్వల్ప దూరాలకు కూడా హెలిపాడ్లు వాడుకుంటూ ప్రజల ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వ్యాపార వేత్త మాదిరి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను తన చేతిలోకి తీసుకుని దొరికినంత దోచుకుని ఖజానా ఖాళీ చేసి వెళ్లారు. వైసీపీ ప్రభుతవరంలో ముఖ్యమంత్రిని కాదు కదా కనీసం వైసీపీ ఎమ్మెల్యే ను కలవాలన్న అందుబాటులో లేని పరిస్థితి.
ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఒక్క మీడియా సమావేశం కానీ, ఒక్క ప్రజాదర్బార్ కానీ నిర్వహించని జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు వెల్లడించడంతో మళ్ళీ ప్రజలతో ముఖాముఖీ అంటూ మరో జగన్నాటకానికి తెరలేపనున్నారు జగన్.
అధికారంలో ఉన్నఐదేళ్లు కనీసం ఏనాడూ సచివాలయానికి కూడా రాలేని జగన్ ఇప్పుడు మళ్ళీ ప్రజల సమస్యలు, ప్రజా వినతులు వినడానికి తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించబోతున్నారంటూ వైసీపీ నేతలు మీడియాకు లీకులు అందిస్తున్నారు.
గడిచిన ఐదేళ్లలో కనీసం జగన్ ప్యాలస్ కు వెళ్లే మార్గాన్ని సైతం మూసేసి సామాన్యుడు వాడకూడదు అని షరతులు విధించి బ్యారీ గేట్లు పెట్టిన ఈ పెత్తందారుడు ఇప్పుడు పేదల కోసం తన ప్యాలస్ గేట్లు తెరవనున్నారా.? అంటే అధికారం పోతే కానీ జగన్ కు ప్రజలు గుర్తు రారా.?
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ మొదలుకుని లోకేష్ ఇలా ఎవరికీ వారు వారి నియోజకవర్గాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు.
అధికారంలో ఉన్న నాయకులే ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కారిస్తుంటే ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే వారు ఎవరుంటారు.? అంటే ఇక్కడ కూడా జగన్ తన ఐప్యాక్ టీం సేవలు వినియోగించుకుంటారా.?
గతంలో నిర్వహించిన సిద్ధం సభలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వాడినట్లు, అలాగే తన ఐప్యాక్ టీం ను వినియోగించుకుని రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలను తీసుకుని వచ్చినట్లు ఇప్పుడు జగన్ ఏర్పాటు చేయబోతున్న ప్రజాదర్బార్ కు కూడా ఐప్యాక్ బృందాన్ని సృష్టించబోతున్నారా.? అంటే ఏమో ఈ జగన్ ఆడే జగన్నాటకాలు ఎవరికెరుకా.? అనే సమాధానమే వినపడుతుంది.




