ఓకే జగన్‌! సై అంటే సై… నేను రెడీ!

YS Jagan Prosecutes Pawan Kalyanజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమయ్యి మంగళగిరి తిరిగివచ్చాక, వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుని జనసేనలో చేర్చుకొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

“జగన్ ప్రభుత్వం రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు రోజుకు కేవలం రూ.164.33 మాత్రమే జీతంగా ఇస్తూ వారి శ్రమను దోచుకొంటోంది. పైగా వారి చేత ప్రజలకు సంబందించి 23 అంశాలపై వ్యక్తిగత సమాచారం సేకరిస్తోంది. క్రూడ్ ఆయిల్ ఎంత విలువైయాందో డాటా కూడా అంతే విలువైనది.

మీరు ఏ అధికారంతో వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు? దీనికి సంబందించి ప్రభుత్వ విధివిధానాలు ఏమిటి?ప్రజల వివరాలు సేకరించడం దానిని వేరే వారికి చేరవేయడం, పేపర్ల మీద లేదా వెబ్‌సైట్‌లలో నిక్షిప్తం చేయడం డాటా చౌర్యమే. చట్టప్రకారం ఇది నేరం.

జగన్‌ ఆదేశానుసారం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు చట్ట వ్యతిరేకంగా డేటా కలెక్ట్ చేస్తున్నందున వారు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులలో చిక్కుకొనే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ డాటా చౌర్యం గురించి నేను ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం నాకు నోటీసులు పంపిస్తోంది. ఇటువంటివాటికి నేను భయపడే వ్యక్తిని కాను. ప్రశ్నిస్తే జగన్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందని నాకు తెలుసు. వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తే నన్ను ప్రాసిక్యూట్ చేస్తానంటోంది ఈ జగన్ ప్రభుత్వం. హత్యలు చేసినవారిని ఈ వ్యవస్థలు ఎలా కాపాడుతాయో నేను చూస్తాను.

ఓకే జగన్‌! సై అంటే సై అని నేను ముందే చెప్పాను కదా? నేను రెడీ నేను రెడీ… మీరు కేసులే వేసుకొంటారో… నన్ను అరెస్ట్‌ చేసుకొంటారో మీ ఇష్టం దేనికైనా నేను రెడీ!

ప్రధాని నరేంద్రమోడీతో నాకు రాజకీయాలకు అతీతంగా చాలా బలమైన సంబంధం ఉంది. అమిత్‌ షాతో జరిగిన చర్చలలో కూడా ఒకటే చెప్పాను. ఇక్కడ రాష్ట్రంలో జగన్‌ పోవడం ఎన్డీయే రావడం… రాష్ట్రాన్ని మళ్ళీ బలంగా నిలబెట్టాలని వారికి చెప్పాను.

ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతూ “పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకొంటుందనే దానిని బట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది తెలుస్తుంది. కనుక ముందుగా ప్రజల మద్యకు వెళ్ళి మన సత్తా నిరూపించుకొని సీట్లు గెలుచుకోవాలి. ఆ తర్వాత పదవులు గురించి ఆలోచిద్దాము. అంతకంటే ముందు జగన్‌ను ఇంటికి పంపించాలి వీలైతే చర్లపల్లికి జైలుకి పంపించాలి, ” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఈసారి మరింత నమ్మకంగా, ధైర్యంగా మాట్లాడిన్నట్లు అర్దమవుతూనే ఉంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు అండగా ఉంటామని హామీ ఇచ్చినందునే పవన్‌ కళ్యాణ్‌ ఈవిదంగా మాట్లాడారని భావించవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మళ్ళీ మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి చేయడం ఖాయం. అయితే పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు వైసీపీకి ప్రమాద గంటికలు మ్రోగిస్తున్నాయని గ్రహిస్తే వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories