సినిమాలకు క్యాచీ టైటిల్స్ కోసం ఇండస్ట్రీలో అందరూ తిప్పలు పడుతుంటారు కానీ రాజకీయ పార్టీ అయిన వైసీపి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలతో, క్యాచీ టైటిల్స్‌తో ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
ఇందుకు ఉదాహరణగా ‘నువ్వే మా నమ్మకం జగన్’, ‘నువ్వే మా భవిష్యత్ జగన్’ వంటి మంచి సెంటిమెంట్ పండించే టైటిల్స్ ఉన్నాయి. అదే పేరుతో ఇంటింటికీ స్టికర్స్ అంటించి “ఇవన్నీ మా వైసీపి ఓట్లు… ఇతర పార్టీలకు అనుమతి లేదని” హెచ్చరించాలనే గొప్ప ఐడియాలు కేవలం వైసీపికి మాత్రమే వస్తుంటాయి.
తాజాగా ‘సిద్దం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఫోటోలతో పోస్టర్స్ వెలిశాయి. ఒకవేళ వాటిలో ఆయన ఫోటో లేకపోతే అదేదో వైసీపి కోసం రాంగోపాల్ వర్మ తీస్తున్న కొత్త సినిమా టైటిల్ అని అందరూ అనుకునేవారు. ఇంతకీ దేనికి సిద్దం?అంటే ఎన్నికలకట!
ఈరోజు సాయంత్రం విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని తగరపువలస జంక్షన్ వద్ద జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. దానికే ఈ సిద్దం టైటిల్.
నాలుగు జాబితాలతో జగన్ తన పార్టీలో అల్లకల్లోల్లం చేసుకుంటూ బిజీగా ఉండగా, హటాత్తుగా షర్మిల ఊడిపడి రాష్ట్రమంతా చుట్టేస్తూ అన్న మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టిడిపి, జనసేనల వలన కలిగే నష్టం కంటే, షర్మిల చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆమె చేస్తున్న రాజకీయాల వలననే వైసీపికి ఎక్కువ నష్టం కలుగుతుందని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే చేతిలో ఉన్న 5వ జాబితాని పక్కన పెట్టి జగన్ కూడా హడావుడిగా బహిరంగ సభలకు ‘సిద్దం’ కాక తప్పలేదు.
కనుక ఈ సభలో జగన్ తన చెల్లిని టార్గెట్ చేసుకుని ఎదురుదాడి చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే ఆమెకే సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడునే నిందించక తప్పదు. పనిలో పనిగా దత్తపుత్రుడు, ఎల్లో మీడియా అంటూ విమర్శలు గుప్పిస్తూ, ఒంటరివాడిని నన్ను మీరే ఆదుకోవాలని ప్రజలను వేడుకోక తప్పదు.
ఎందుకంటే టిడిపి, జనసేనలను విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోగా అవి సీట్లు సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి కనుక. ఇది జగన్‌కు చాలా ఆందోళన, అసహనం కలిగించేదే. కనుక మనసులో ఆ బాధని వెళ్ళగ్రక్కేందుకు ఓ సభ అవసరం. నేడు భీమిలి సభలో ఆ ఆక్రోశం చూడవచ్చు.
అయితే విశాఖ రాజధాని కధ ఏమైంది? ఉత్తరాంధ్రా జిల్లాలను ఉద్దరించేందుకు జగన్ విశాఖ ఎందుకు రాలేదు? ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎందుకు పక్కన పెట్టేశారు?వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేరు కనుక ఎప్పటిలాగే ప్రజలకు చాలా మేలు చేశానంటూ సొంత బాజా వాయించుకుని, ప్రతిపక్షాలపై విరుచుకు పడేందుకే ఈ సభ.




