పోలవరం హైడల్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసుకున్న నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అలాగే రివర్స్ టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థనే కొనసాగిస్తారా లేక ప్రభుత్వం పట్టు విడవకుండా సుప్రీం కోర్టు తలుపు తడతారా అనేది చూడాలి.
హైడల్ ప్రాజెక్టు ఒప్పందం నవయుగ, ఏపీజెన్‌కోల మధ్య జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో థర్డ్ పార్టీ మాత్రమేనని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే తమవైపు నుండి ఎటువంటి తప్పు లేకపోయినా ఏపీజెన్‌కో ఒప్పందం రద్దు చేసుకుందని నవయుగ కోర్టు దృష్టికి తెచ్చింది. అలాగే కొత్తగా ఆహ్వానించిన టెండరు నోటిఫికేషన్‌లో 58 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, మేము గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2021 నవంబరు నాటికే ప్రాజెక్టును పూర్తి చేసి ఇస్తాం నవయుగ సంస్థ తెలిపింది.
అలాగే ప్రాజెక్టు స్థలాన్ని ఇప్పటివరకు తమకు అప్పగించలేదని దానితో అప్పటివరకూ ఏదైనా ఆలస్యం జరిగినా అది తమవల్ల కాదని నవయుగ కోర్టుకు చెప్పింది. దానితో ఏకీభవించిన కోర్టు ప్రిక్లోజర్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అలాగే రివర్స్ టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. మరోవైపు ఈ తీర్పు తమ పాలనలోని పారదర్శకతకు నిదర్శనమని, ఇప్పటికైనా జగన్ కక్షసాధింపు రాజకీయాలు మాని పాలన మీద దృష్టి పెట్టాలని టీడీపీ నేతలు అంటున్నారు.



