ఆ తిట్లు కూడా ఐప్యాక్ సలహాయేనా… అయితే జాలి పడాల్సిందే!

YS Jagan I-Pac Teamగత ఎన్నికలలో వైసీపీకి ఎన్నికల వ్యూహాలు రచించి గెలిపించిన ఐప్యాక్, ఈసారి కూడా వైసీపీ కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వ పనితీరు, పార్టీ బలాబలాలను అంచనా వేసి ఎన్నికల వ్యూహాలు రచించాల్సిన ఐప్యాక్, కుట్రలు, కుతంత్రాలనే ఎన్నికల వ్యూహాలుగా మార్చేయడం విస్మయం కలిగిస్తోంది.

ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ న్యాయం, ధర్మం, నైతిక విలువలంటూ బిహార్‌లో ప్రసంగిస్తుంటే, ఇక్కడ ఏపీలో ఆయన బృందం అందుకు పూర్తి విరుద్దంగా పనిచేస్తుండటం విశేషం. జూ.ఎన్టీఆర్‌ కాబోయే ముఖ్యమంత్రి అంటూ టిడిపి పేరుతో పోస్టర్స్ అంటించడం, నారా లోకేష్‌ పాదయాత్రలో గూడచర్యం చేస్తుండటం ఇందుకు చిన్న ఉదాదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

సిఎం జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ సూచనల ప్రకారమే ముందుకు సాగుతున్నారు కనుక మొన్న వెంకటగిరి సభలో మాట్లాడిన మాటలు కూడా దాని సలహాయే అయ్యుండవచ్చు.

వాలంటీర్ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న వాదనలతో దానిపై యావత్ రాష్ట్ర ప్రజలకు అనుమానాలు మొదలవగా, తాము చేస్తున్న పనులకు భవిష్యత్‌లో జైలుకు వెళ్ళవలసివస్తుందనే భయం వాలంటీర్లలో కూడా మొదలైంది. ముఖ్యంగా రోజుకు రూ.164.33 జీతం కోసం తమ జీవితాలు పణంగా పెడుతున్నామనే ఆలోచన పవన్‌ కళ్యాణ్‌ వారిలో కలుగజేశారని చెపొచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఇతర పార్టీలు కూడా ఇప్పుడు ధైర్యంగా దానిలో లోపాలను ఎత్తిచూపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ పరిణామాలు వైసీపీకి వెన్నెముక వంటి వాలంటీర్ వ్యవస్థను ఛిద్రం చేసే ప్రమాదం కనిపిస్తోంది. ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటు చేసుకొన్న ఈ వాలంటీర్ వ్యవస్థ కుప్పకూలిపోతే ఎన్నికలలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం.

కనుక ఈ పరిస్థితులలో అత్యవసరంగా వాలంటీర్ వ్యవస్థను కాపాడుకోవలసి ఉంటుంది. అందుకే సిఎం జగన్‌ దానిపై ప్రజలకు మళ్ళీ నమ్మకం కల్పిస్తూ, వాలంటీర్లకు ధైర్యం నూరిపోస్తూనే కాసేపు తన హోదాను పక్కన పెట్టి ‘నాలుగేళ్ళకోసారి పెళ్ళాలు మార్చడం’, ‘మహిళలు కనిపిస్తే కడుపు చేయడం’ బాలకృష్ణను ఉద్దేశ్యించి ‘దౌర్భాగ్యుడు’ వంటి దిగ్బ్రాంతికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఊహించిన్నట్లే ఇప్పుడు ప్రతిపక్షాలు, మీడియా అందరూ జగన్‌ మాట్లాడినతీరు గురించే చర్చిస్తున్నారు. ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆవిదంగా మాట్లాడటం సరికాదంటూ వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా జగన్‌ వ్యాఖ్యలలో ఉచితానుచితాల గురించే మాట్లాడుకొంటున్నారు.

తద్వారా వాలంటీర్ వ్యవస్థపై నుంచి అందరి దృష్టి మళ్లించాలనే ఐప్యాక్ వ్యూహం విజయవంతం అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు… తాను మాట్లాడిన ఈ మాటలను ఖచ్చితంగా తప్పు పడతారని జగన్‌కు తెలియదనుకోలేము. అయితే దాని వలన కలిగే నష్టం కంటే వాలంటీర్ వ్యవస్థ కుప్ప కూలిపోతే జరిగే నష్టమే ఎక్కువ. అందుకే జగన్‌ ప్రతిపక్ష నేతలను ఏవిదంగా తిట్టాలో ఓ కాగితం మీద రాసుకొచ్చి మరీ తిట్టారని భావించవచ్చు.

అయితే జగన్ ప్రభుత్వాన్ని ఓ సమస్య నుంచి బయటపడేయడానికి ఐప్యాక్ ఇటువంటి సలహాలు ఇస్తూ మరో సమస్య సృష్టిస్తుండటమే విడ్డూరంగా ఉంది.

జగన్‌ మాట్లాడిన మాటలతో ఆయన ‘పెద్ద మనిషి ముసుగు’ను ఐప్యాక్ స్వయంగా తొలగిపోయేలా చేసింది. అంతేకాదు… పవన్‌ కళ్యాణ్‌ మీద పరువునష్టం దావా వేయాలనే సలహా కూడా దానిదే అయితే జగన్‌కు అదే శల్యసారధ్యం చేసి ఎన్నికలలో ఓడించడం ఖాయమనే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories