వైసీపి అత్యుత్సాహమే కొంప ముంచిందిగా!

Vizag Rushikonda

విశాఖ రాజధానిగా చేస్తామని జగన్‌ ప్రభుత్వం చెప్పినప్పుడు విశాఖ నగర ప్రజలు చాలా సంతోషించి ఉండాలి. వైసీపికి బ్రహ్మరధం పట్టి ఉండాలి. ఈ ప్రభావం ఉత్తరాంధ్రా జిల్లాలపై కూడా ఉండి ఉండాలి. అసలు ఈ ఒక్క హామీతోనే ఉత్తరాంధ్రా జిల్లాలలో టిడిపి, జనసేనలు తుడిచిపెట్టుకుపోవాలి. కానీ ఇవేమీ జరుగడం లేదు.

ADVERTISEMENT

నిజానికి ఇది చాలా అద్భుతమైన వ్యూహమే. కానీ జగన్మోహన్‌ రెడ్డి ఈ వ్యూహాన్ని అమలుచేయలేక చేతులు ఎత్తేయడంతో బెడిసికొట్టింది.

ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్‌ రెడ్డి చాలాసార్లు విశాఖ వచ్చి వెళ్ళారు కానీ రూ.400 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి ఋషికొండపై కట్టుకున్న విలాసవంతమైన భవనంలో కాలుపెట్టే సాహసం చేయలేకపోయారు. మంత్రులు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొంటున్నామంటూ హడావుడి చేసినప్పటికీ ఆ తర్వాత అదంతా డ్రామా అని తేలిపోయింది. విశాఖ ప్రజలకు కూడా వైసీపిపై నమ్మకం పోయింది.

జగన్‌ తలుచుకుంటే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయగలిగేవారు. కానీ ఆయన ఈ విషయంలో కూడా మూడు రాజధానుల పేరుతో ఓ రాజకీయ ఎత్తుగడ వేసి రాజధాని అంశాన్ని వివాదాస్పదంగా మార్చేసి హైకోర్టు, సుప్రీంకోర్టులకు చేరేలా చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలను బూచిగా చూపిస్తూ కనీసం ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయకుండా 5 ఏళ్ళు కాలక్షేపం చేసేశారు.

అయినా ముందుగా విశాఖను అభివృద్ధి చేయకుండా రాజధానిగా చేస్తామంటే విశాఖ ప్రజలు కూడా నమ్మలేదు. ‘విశాఖ రాజధాని-ఉత్తరాంధ్రా జిల్లాలకు కలిగే లాభాలు’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాద రావు వంటివారు చాలా మాటలు చెప్పారు. కనుక ఈ ప్రభావం ఉత్తరాంధ్రాలొ అన్ని జిల్లాలకు ఆయన వంటి వైసీపి నేతలే స్వయంగా వ్యాపింపజేసుకున్నారు.

కనుక ఇప్పుడు ఈ విశాఖ రాజధాని అంశమే వైసీపి అభ్యర్ధుల మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. గతంలో వైసీపి నేతలు చెపితే ప్రజలు వినేవారు. ఇప్పుడు ప్రజలే విశాఖ రాజధాని గురించి వైసీపి అభ్యర్ధులను నిలదీసి అడుగుతున్నారు.

కానీ ఈ ప్రశ్నకు వారి వద్ద జవాబు లేదు కనుక టిడిపి అభ్యర్ధులను ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే విశాఖతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో అలవోకగా గెలవాల్సిన వైసీపి అభ్యర్ధులు ఇప్పుడు ఎదురీద వలసి వస్తోంది.

విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీరాణిని విశాఖకు తీసుకువచ్చి లోక్‌సభకు పోటీ చేయించాల్సి వస్తోందంటే ఉత్తరాంధ్రా జిల్లాలలో వైసీపి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

అసలు టిడిపి, జనసేనలను ఉత్తరాంధ్రా జిల్లాలలో అడుగే పెట్టనీయకూడదనుకుంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖ జిల్లా వరకు ప్రతీ నియోజకవర్గంలో టిడిపిని ఎదుర్కోవడానికి వైసీపి ఆపసోపాలు పడుతుండటం గమనిస్తే దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అని అనిపించక మానదు.

ADVERTISEMENT
Latest Stories