రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలవడానికి మానిఫెస్టోలో అనేక హామీలు గుప్పిస్తుంటాయి. అలాగే రకరకాల వ్యూహాలు కూడా అమలు చేస్తుంటాయి.
గత ఎన్నికలలో టిడిపి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందనుకొంటే ఈ వ్యూహాల కారణంగానే వైసీపీ చేతిలో చాలా అవమానకర స్థాయిలో ఓడిపోయింది. టిడిపి ఓటమికి, వైసీపీ గెలుపుకి కారణాలు అందరికీ తెలిసినవే కనుక వాటి గురించి చర్చ ఇప్పుడు అప్రస్తుతం.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2024లో జరుగబోయే ఎన్నికలలో గెలిచేందుకు అనేక వ్యూహాలు అమలుచేయడం ప్రారంభించేసింది. వాటిలో అత్యంత ప్రధానమైనవి సంక్షేమ పధకాలు.
సంక్షేమ పధకాలతో లబ్ధిపొందుతున్నవారందరూ మళ్ళీ వైసీపీకే ఓట్లు వేస్తారనే నమ్మకం లేకనే మంత్రులు, ఎమ్మెల్యేలను జగన్ గడప గడపకి వెళ్ళమని నొక్కి చెపుతున్నారనుకోవచ్చు.
ఆ పధకాల కోసం చేసిన అప్పుల భారం లబ్ధిదారులతో సహా రాష్ట్రంలో మిగిలిన ప్రజలందరి మీద మోపుతుండటం వలన అన్నిటి ధరలు, ఛార్జీలు, పన్నులు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారు. అయితే ప్రజలు తమ అసంతృప్తిని, అసహనాన్ని నేరుగా ప్రభుత్వానికి చెప్పలేరు. ఎన్నికలలో తమ ఓట్ల ద్వారానే చెపుతుంటారు. కనుక ఈసారి ఎన్నికలలో ప్రజలు సంక్షేమ పధకాలపై తమ తీర్పు చెప్పబోతున్నారు. అది వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా? అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు లభిస్తున్న ప్రజాధారణ చూస్తే అర్దమవుతుంది.
వైసీపీ అధినేత మరో మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు. వైసీపీ కోసమే వీటిని సృష్టించుకొన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు స్పందిస్తూ ఎంత పెద్ద నోరు పెట్టుకొని ఎదురుదాడి చేసినప్పటికీ, ఆయన చెప్పిన మాటలు ప్రజలందరికీ బాగానే చేరాయనే చెపొచ్చు.
కనుక వాలంటీర్ వ్యవస్థని వైసీపీ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతీసారి ప్రజలలో దానిపట్ల అనుమానాలు, అపనమ్మకం పెరుగుతూనే ఉంటుంది. కనుక జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి సృష్టించుకొన్న వాలంటీర్ వ్యవస్థ, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కర్ణుడికి ఉపయోగపడని ఆయుధాలుగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.



