‘బికాంలో ఫిజిక్స్…’ అంటూ ఓ రేంజ్ లో పబ్లిసిటీ కొట్టేసిన జలీల్ ఖాన్, తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలపై స్పందించారు. ఈ ప్లీనరీలో జగన్ ప్రసంగించిన తీరును ఏకరువు పెట్టిన జలీల్ ఖాన్ పంచ్ లతో తన ప్రసంగాన్ని నింపేసాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను అని చెప్తున్నారు తప్ప, ప్రజాసేవ చేస్తానని చెప్పడం లేదని… దీంతో రాజకీయాలలో జగన్ ఏకైక లక్ష్యం ఏమిటో చెప్పకనే చెప్పారని మండిపడ్డారు.
మంచి నాయకుడు ఎవరైనా ప్రజాసేవ చేస్తానని చెప్పుకుంటారని, కానీ జగన్ మాత్రం సిఎం అవుతానని మాత్రమే చెప్పుకుంటున్నారని, అది కూడా ముప్పై ఏళ్ళ పాటు అంట… అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ అనే వ్యక్తి ‘నాయకుడు’ కాలేడని, ‘ఖల్ నాయక్’ (ప్రతి నాయకుడు) మాత్రం ఖచ్చితంగా అవుతారని అన్న జలీల్, అసలు తండ్రి శవం దగ్గర నుండి సిఎం కోరికను వెలిబుచ్చిన జగన్ ఆశ ఎప్పటికీ నెరవేరదని అన్నారు.
మరోవైపు నారా లోకేష్ కూడా తనదైన శైలిలో జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబును తిట్టడానికే ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారన్న విషయం తేటతెల్లమైందని, రాష్ట్రంలో అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులలో జగన్ మొదటివారని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేయడం అంటే… తనలోని అసమర్ధతను బయట పెట్టడమేనని చంద్రబాబు కూడా జగన్ తీరును ఎండకట్టారు.



