వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడానికి ఏకైక అర్హత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కావడమే. ఆమెకు కాంగ్రెస్ అప్పగించడానికి ఏకైక కారణం ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉండటమే. ఈ అర్హతతో, ఈ కారణంతోనే ఆమెకు అధిష్టానం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారనేది సత్యం.
ఈ విషయం ఆమెకు కూడా బాగా తెలుసు. కనుకనే పులి కడుపున ఫులే పుడుతుందంటూ డైలాగులు చెపుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సూచించిన్నట్లే జగనన్నను టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నారు.
అయితే ఈ అర్హత, కారణం రెండూ ఏపీ కాంగ్రెస్ పట్ల ప్రజలకు మళ్ళీ నమ్మకం కల్పించలేవు. కనుక ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అనే తాయిలం ఆమె చేతిలో పెట్టి పంపించారు.
ఎలాగూ కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ శత్రువులే కనుక బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాల జాబితాని కూడా ఆమె చేతిలో పెట్టి పంపించారు. కనుక వాటితో ఆమె చెలరేగిపోతూ బీజేపీని విమర్శిస్తూ, ప్రత్యేక హోదా తాయిలం చూపిస్తూ ఏపీ ప్రజలను ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాణప్రతిష్ట చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన ‘గైడ్ లైన్స్’ కంటే కాస్త ఎక్కువగానే ఆమె వైఎస్ కుటుంబ వ్యవహారాలను కెలుకుతున్నారు. ఆమె తీరు పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లు సాగుతుండటంతో జగన్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వేరే విషయం.
ఈరోజు తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఆమె అన్న కోసం తాను చేసిన త్యాగాల జాబితా చదివి, ఆ తర్వాత పులిబిడ్డ, ఏపీకి ప్రత్యేకహోదా, నీతి నిజాయితీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజన్న రాజ్యం వంటి పదాలతో రోటీన్‌గా చెపుతున్నావన్నీ మరోసారి చెప్పేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణ చెప్పిన డైలాగ్స్‌లో ‘తెలంగాణ’ అనే పదం తొలగించి ‘ఆంధ్రా’ అని పెట్టి ‘కట్ అండ్ పేస్ట్’లా ఇక్కడ కూడా వల్లెవేసేస్తుండటం గమనార్హం. ఆనాడు తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసమే తాను తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించానని, కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వారి కొరకే పోరాడుతుంటానని చెప్పేవారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా అవే చెపుతున్నారు. ఎందుకంటే వేరేగా చెప్పలేరు కనుక!
ప్రజలను ఆకట్టుకోవడం కోసం అన్నపై విమర్శలు, పార్టీ నేతలు శ్రేణులను ఆకట్టుకోవడం కోసం రాజన్న బిడ్డ క్వాలిఫికేషన్, దానికి కాస్త అన్న సెంటిమెంట్ కూడా జోడించి ఆమె చక్కగానే వాడుతున్నారు.
అయితే ఆమెలో, కాంగ్రెస్ పార్టీలో లోపించింది… విశ్వసనీయతే! వైఎస్ షర్మిల తన రాజకీయ లక్ష్యం కొరకు అంటే ఏపీకి ముఖ్యమంత్రి అయ్యేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో రాజకీయాలు చేస్తుంటే, ఆమె ద్వారా ఏపీ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆశపడుతోంది. మరి వారి ఆశలు నెరవేరుతాయో లేదో?




