ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష జగన్ చెల్లెలు వైఎస్ షర్మిళ తెర మీదకు వచ్చారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ను కలిసి హీరో ప్రభాస్ కు తనకూ సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం చేస్తుందని కంప్లయింట్ చేశారు. ఈ ప్రచారాల వెనుక టీడీపీ ఉందని భావిస్తున్నా అని ఆవిడ ఆరోపించారు. ఈ క్రమంలో షర్మిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన సహజ శైలిలో విరుచుకుపడ్డారు.
“ఏ హీరోతో అయితే సంబంధం ఉందని తప్పడు ప్రచారం చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఇదే నిజమని నాపిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. తప్పడు ప్రచారాలు చేస్తున్న వారు మీరు ప్రచారం చేస్తున్నదే నిజం అని, నాలా ప్రమాణం చేయగలరా. లేదా రుజువులు, ఆధారాలు చూపించగలరా?,” అని షర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి ఈ పుకార్లతో సంబంధంలేకపోతే. ఆ పార్టీ వాళ్లు మాట్లాడతున్నప్పుడు ఆ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు. ఒక అమ్మాయి మీద అలా మాట్లాడటం తప్పు అని ఎందుకు ఆపలేదని ఆవిడ ప్రశ్నించారు.
“తెలుగువారి ఆత్మ గౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్లు, అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి. లేక పోతే మీ పార్టీలోని మహిళలు, మీ కుటుంబంలోని మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందని భావిస్తున్నారో అదికూడా చెప్పండి. రాజకీయాలను ఇంతలా దిగజార్చకండి. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా. అలాంటి పుకార్లు మేము పుట్టించలేమా? మాకు విలువలున్నాయి, నైతికత, మంచితనం ఉంది,” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో టీడీపీవారితో పాటు జనసేన శ్రేణుల మీద కూడా ఆరోపణలు చేసినట్టు సమాచారం. అయితే షర్మిళ తన ప్రెస్ మీట్ లో జనసేన గురించి ప్రస్తావించలేదు. షర్మిళ తో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటూ కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు. ఈ విషయంగా ఏపీ పోలీసులకు కాకుండా తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడం గమనార్హం.



