ఆనాడు చంద్రబాబు నాయుడుని శాసనసభలో జగన్ సమక్షంలోనే వైసీపి ఎమ్మెల్యేలు దారుణంగా అవమానిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతాను అంటూ శపధం చేసి బయటకు వచ్చేశారు. ఆ శపధం నెరవేర్చుకున్నారు.
శాసనసభకు వచ్చేందుకు భయపడుతున్న జగన్ తనకు ప్రతిపక్షనాయకుడు హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని చెప్పి మొహం చాటేస్తున్నారు. మళ్ళీ 175 సీట్లతో తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు తనకు ప్రతిపక్షనాయకుడు హోదా ఇవ్వాలని బ్రతిమాలుకోవడం లేదా బెట్టు చేస్తుండటం చూస్తే నవ్వొస్తుంది.
ఇదివరకు టిడిపికి 23 మంది సభ్యులు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన నోటితోనే అందులో సగం బలం కూడా లేని తమకు తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని జగన్ పట్టుబడుతుండటం చూసి జనం నవ్వుకుంటున్నారని గ్రహించిన్నట్లు లేరు. శాసనసభకు వెళ్ళి అవమానపడేకంటే జనం నవ్వుకున్నా పర్వాలేదనుకుంటున్నారేమో తెలీదు. అందుకే శాసనసభకు వెళ్ళకుండా తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశాలతో కాలక్షేపం చేస్తున్నారు.
సింగిల్ సింహం, అర్జునుడు పద్మవ్యూహం అని గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి, శాసనసభకు వెళ్ళేందుకు భయపడుతుండటం సిగ్గు చేటు. శాసనసభకు వెళ్ళదలచకపోతే మీరు, మీ ఎమ్మెల్యేలు అందరూ మీ పదవులకు రాజీనామా చేసేయందంటూ ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
‘సిగ్గు సిగ్గు!!’ అంటూ ట్విట్టర్‌లో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. తన అన్న గురించి షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే… “మాజీ ముఖ్యమంత్రి @ysjagan శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం.
ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు.
జగన్ మోహన్ రెడ్డి గారు, కానీ మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం.
బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు.
ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి అప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని @INC_Andhra కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది,” అని ట్వీట్ చేశారు.




