తెలంగాణ సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్ ధాటిని జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్ పార్టీలే తట్టుకోలేక విలవిలలాడుతుంటే, వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి సిఎం కేసీఆర్‌ను గద్దె దించుతానంటూ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు. అసలు తెలంగాణతో సంబందం లేని ఈమె ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టారో అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.
సిఎం కేసీఆర్‌పై సందించిన జగనన్న బాణం ఆమె అని కొందరు, కాదు…జగనన్న మంత్రి పదవి ఇవ్వనందునే తెలంగాణ వచ్చేశారని కొందరు…ఇవేమీ కాదు… రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్లను చీల్చేందుకు సిఎం కేసీఆర్, జగనన్న కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే ఇదంతా అని మరికొందరు ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొంటున్నారు.
కారణాలు ఏవైనప్పటికీ ఆమెకు అధికారం, ముఖ్యమంత్రి పదవి కావాలనుకొంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టుకొని తిరగాలి గానీ మా రాష్ట్రంలో ఈమె పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారని మండుటెండల్లో తిరుగుతున్న ఆమెను చూసి ప్రజలు జాలిపడుతున్నారు.
హాయిగా ఏసీ రూములో గడపవలసిన షర్మిల ఈవిదంగా పలు అనుమానాలు, సానుభూతిగా చూస్తున్న జనాల మద్య ఎండలు, వడగాడ్పులను భరిస్తూ పాదయాత్ర చేసుకొంటూపోతున్నారు. దీంతో ఆమె ఏమి సాధించదలచుకొన్నారో ముందే చెప్పేశారు కనుక నిత్యం సిఎం కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని గురించి నిలదీస్తున్నారు.
గమ్మతైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీదపడిపోయి ఎదురుదాడి చేసే టిఆర్ఎస్ మంత్రులు, నేతలు వైఎస్ షర్మిల నిత్యం సిఎం కేసీఆర్‌ను పేరు పెట్టి తిట్టిపోస్తున్నా కిమ్మనడం లేదు. తెలంగాణ రాష్ట్రానికే చెందిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుంటే ఎక్కడికక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలతో అడ్డుకొంటూ, భౌతిక దాడులు చేయిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం, వైఎస్ షర్మిల సిఎం కేసీఆర్‌ను రోజూ తిట్టిపోస్తున్నా, తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా ఆమె పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేయడం లేదు కనీసం పట్టించుకోవడం లేదు. అంటే ఆమె వలన టిఆర్ఎస్‌కు ప్రమాదం లేదని భావిస్తున్నారా లేక తెలంగాణలో ఆమె నాటకీయమైన ఎంట్రీ, ఈ పాదయాత్ర డ్రామా అంతా తమ వ్యూహంలో భాగమే కనుక పట్టించుకోవడం లేదా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ వైఎస్ షర్మిల మాత్రం ఎవరేమనుకొంటున్నా మొహమాట పడకుండా పాదయాత్ర చేసుకొనిపోతూనే ఉన్నారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పరిధిలో కరకవాగులో ‘రైతు గోస దీక్ష’లో పాల్గొన్న ఆమె నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రజలను సిఎం కేసీఆర్ మోసం చేస్తున్న మోసగాడని తిట్టిపోశారు. కానీ టిఆర్ఎస్‌కి ఆ తిట్లు వినబడలేదు! మరేమనుకోవాలో?



