వైఎస్ఆర్‌ ప్రమాదంలో మరణించలేదు.. హత్యచేయబడ్డారు: షర్మిల

YS Sharmila sensatinal comments on his father ysr deathసిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారిని కుట్ర చేసి హత్య చేశారు. ఇప్పుడు నన్ను కూడా హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. నేను బ్రతికున్నంతకాలం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాను. కేసీఆర్‌ అవినీతి పాలనని నిలదీస్తూనే ఉంటాను. అందుకే కదా మీ మంత్రులు, శాసనసభ్యులు నాపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి నాపై ఫిర్యాదు చేశారు. ఒంటరిగా పోరాడుతున్న ఓ మహిళను ఎదుర్కొలేకనే మీరు ఫిర్యాదు చేశారు.

నాపై పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకం అయితే సంతోషిచేదాన్ని కానీ నాపై పిర్యాదులు చేయడానికి ఏకం అవుతున్నారు. అయితే మీ బెదిరింపులకి భయపడను. నన్ను ఎవరనుకొంటున్నారు? రాజశేఖర్ గారి బిడ్డను. పులి బిడ్డని. మీకు దమ్ముంటే పోలీసులను పంపించి నన్ను అరెస్ట్ చేయించండి. నేను ఇక్కడే ప్రజల మద్యే ఉంటాను. మీకు పోలీసులు ఉంటే నా వెంట ప్రజలున్నారు,” అని అన్నారు.

ADVERTISEMENT

వైఎస్ షర్మిల చెప్పిన దానిలో తన వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారిని కుట్ర చేసి హత్య చేశారని చెప్పడం చాలా సంచలనమైన విషయమే. ఇంతవరకు ఆయన కడప జిల్లా పావురాలగుట్టలో హెలికాఫ్టర్‌ కూలిపోయి ప్రమాదంలో చనిపోయారని అందరూ భావిస్తున్నారు. ఆయన మరణంపై జరిపిన విచారణలో కూడా ఆయన ప్రమాదంలోనే చనిపోయినట్లు దృవీకరించారు. కానీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు వైఎస్ షర్మిల తన తండ్రి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోలేదని, కుట్ర చేసి హత్య చేయబడ్డారని ఆరోపించారు.

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమె తన తండ్రిని హత్య చేయించినట్లే తనను కూడా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మరో ఆరోపణ చేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంటే తన తండ్రి హత్యకు కేసీఆర్‌ కారణమని ఆమె ఆరోపిస్తున్నారా?ఆమె చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఏమంటారు? ఆమె సోదరుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారు?

అసలు రాజశేఖర్ రెడ్డిని హత్య చేసినట్లు వైఎస్ షర్మిల భావిస్తున్నట్లయితే ఇంతకాలం ఎందుకు ఈ విషయం బయటపెట్టలేదు? తన తండ్రి హత్యకు కుట్ర పన్నినవారి పేర్లను ఇప్పుడూ ఎందుకు బయటపెట్టడం లేదు?ఆమె ఈ ఆరోపణలకు కట్టుబడి ఉంటారా లేక తెలంగాణ రాజకీయాలలో గుర్తింపు సంపాదించుకోవడానికే ఇటువంటి సంచలన ఆరోపణలు చేస్తున్నారా?ఈ ప్రశ్నలలో కొన్నిటికి రాబోయే రోజుల్లో సమాధానాలు దొరకవచ్చు.

తన తండ్రి హత్య చేయబడ్డారంటూ వైఎస్ షర్మిల చేసిన తాజా ఆరోపణలు ఆమె సోదరుడు, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగానే హత్య చేయబడి ఉంటే వైఎస్ షర్మిలకు తెలిసిన ఈ విషయం సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉండదు. మొదట్లో ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. కానీ ఆ తర్వాత ఏనాడూ జగన్మోహన్ రెడ్డి ఆ ఆరోపణ చేయలేదు. బాబాయ్ వైస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఇప్పుడు సొంత తండ్రి హత్య చేయబడినట్లు చెల్లెలు చేస్తున్న ఈ ఆరోపణపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారో?

ADVERTISEMENT
Latest Stories