“యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధం” వచ్చేసిందా..?

Sharmila

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరగబోయేది కురుక్షేత్రం అని, అందులో ధర్మమే గెలుస్తుందని తనను తాను ఒక ధర్మరాజుగా భావించి ప్రజలకు గీతోపదేశం చేస్తుంటారు. జగన్ ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో ఎందుకు పోల్చుకున్నారో కానీ “యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి”…అంటూ RRR సినిమాలో చెప్పిన డైలాగ్ ఒకటి ఇప్పుడు ఏపీ రాజకీయాలకు చక్కగా సరిపోతుందేమో అనిపించేలా పరిస్థితులు మారిపోయాయి.

తన సైన్యంతో “ఆడవారి పై రాజకీయాలు చేసి మానసిక అనందం పొందిన జగన్ కు ఇప్పుడు ఆడవారితో రాజకీయం చేయడం ఎంత కష్టమో జస్ట్ శాంపిల్” చూపిస్తున్నారు ఆయన సోదరి వైస్ షర్మిల. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారని తెలిసే ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టనంటూ జగన్ సైన్యానికి ఒక హెచ్చరిక చేసారు షర్మిల. అలాగే జగన్ చేసే కురుక్షేత్ర యుద్ధంలో ఆయనను ఓడించడానికి షర్మిల అనే ఒక ఆయుధం ఇప్పటికే రణస్థలానికి చేరింది అని వైసీపీ కి హింట్ ఇచ్చారు.

ADVERTISEMENT

షర్మిల, నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం షర్మిల పై పరోక్ష పద్దతిలోనే విమర్శలకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి దాక ఇదంతా చంద్రబాబు పన్నిన వల, రాజకీయాల కోసం కుటుంబాలను కూడా చీల్చడానికి సిద్ధమయ్యారు అంటూ టీడీపీ పార్టీ పైన బాబు పైన నిందలేసిన జగన్ ఇప్పుడు బాబు కాదు ఇదంతా కాంగ్రెస్ పార్టీ పనే అంటూ తనకలవాటైన మాటమార్చడం, మడం తిప్పడం చేసేసారు.

నారాసుర రక్త చరిత్ర అంటూ 2019 ఎన్నికలకెళ్లిన జగన్ ఎన్నికలు పూర్తి అవ్వగానే అది వివేకా అవివేకం వల్లనే అని, కుటుంబ కలహాలే కారణమంటూ మాట కాదు ఏకంగా కథే మార్చేశారు. ఇప్పుడు కూడా అదే ఫాలో అయిన జగన్ కు ఈసారి షర్మిల గట్టి షాకే ఇచ్చింది. వైస్ కుటుంబం చీలిపోవడానికి కాంగ్రెస్ పార్టీనో, మరెవరో కారణం కాదు. దానికి పూర్తి బాధ్యత వైస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే, దానికి మా అమ్మ విజయలక్ష్మి, నా కుటుంబం మొత్తం సాక్ష్యం అంటూ జగన్ చిట్టా మొత్తం బయటపెట్టారు షర్మిల.

జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీకోసం తల్లి విజయలక్ష్మితో కలిసి తన కుటుంబాన్ని, పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకు వచ్చి జగన్ కోసం ప్రచారం చేసానని, తీరా అధికారం రాగానే జగన్ ప్రవర్తన మారిపోయిందంటూ తన ఆవేదన పంచుకున్నారు. నమ్మిన వారిని దూరం చేసుకుని ఇప్పుడు వేరేవారి పై నిందలు మోపడం సరికాదంటూ హెచ్చరించారు. ఇలా జగన్ పై ఈస్థాయిలో విమర్శలు చేయడం మాత్రం ఒక్క షర్మిలకు సాధ్యమయ్యే కార్యం లా కనపడుతుంది.

ఇప్పుడు వైసీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి జగన్ కానీ షర్మిలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే భావనలోకి వచ్చేసారు. బాబు, లోకేష్, పవన్ ల మీద చేసేంత స్థాయిలో షర్మిల పై విమర్శలు చేస్తే షర్మిల జగన్ కోట రహస్యాలు ఇంకెన్ని బయటపెడుతుందో అనే భయం అటు పార్టీ నాయకులతో పాటుగా జగన్ ను కంగారుపెడుతుంది. ఇంకా “ముడులు విప్పని గండి కోట రహస్యాలు” వైసీపీ లో చాలానే ఉన్నాయి కాబట్టి షర్మిల విషయంలో జగన్ అండ్ కో ఆచితూచి అడుగు ముందుకేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories