వైసీపీలో కుటుంబ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరిది అధికారం ఉందనే అహకారం, మరొకరిది న్యాయం జరగలేదే అనే ఆవేదన, మరొకరిది గుర్తింపు దక్కలేదే అన్న బాధ. ఇవన్నీ కూడా ఒక్క వైస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే. కడప ఎంపీ గా షర్మిలను నిలబెట్టాలని పట్టుబట్టినందుకే వివేకా ఇంతటి దారుణమైన గొడ్డలి వేటుకు బలయ్యారు అంటూ సునీత, షర్మిల జగన్ వ్యతిరేకంగా కథం తొక్కారు.
ఒక్క ఎంపీ స్థానం కోసం జగన్ తన సొంత చెల్లిని దూరం చేసుకున్నారా..? తన సొంత బాబాయిని అంతమొందించారా..? అనే రెండు ప్రశ్నలు కడప ఓటర్లతో పాటు రాష్ట్ర ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. సునీత, షర్మిల ఎంచుకున్న ప్రచార శైలి, వారు అడుగుతున్న ప్రశ్నలు, చెపుతున్న నిజాలు అన్ని వైసీపీకి వ్యతిరేకంగా ఉండడంతో సొంత చెల్లెళ్లకు సైతం వైసీపీ ట్రీట్మెంట్ ఇచ్చారు జగన్.
తన సోషల్ మీడియా సైన్యంతో, తన ఆత్మ సాక్షి లో షర్మిల, సునీత, వివేకా వ్యక్తిగత జీవితాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చారు జగన్. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో షర్మిల గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసారు జగన్. అయితే వాటి మీద స్పందించిన షర్మిల తన అన్న గెలుపు కోసం తానూ చేసిన త్యాగానికి, పడిన కష్టానికి నాకు జగన్ ఇచ్చిన బహుమతి ఇది అంటూ జగన్ పై కొన్ని ప్రశ్నలు సంధించారు.
నాకు అధికార కాంక్ష, డబ్బు మీద వ్యామోహం ఉందంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు కదా నిజంగా నాకు అధికార కాంక్షే ఉండి ఉంటే నేను వైసీపీ తరుపున పాదయాత్ర చేసే సమయంలో జగన్ అవినీతి కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్నారు. దాని నేను అవకాశంగా తీసుకుని వైసీపీ పార్టీని చేజిక్కించుకునేదాన్ని కదా..? నా అన్న కోసం నా సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి కాళ్లకు బలపం కట్టుకుని బై బై బాబు అంటూ క్యాంపైన్ లు చేసింది ఎవరి కోసం..?
ఈ సమయంలో నేను మీ నుండి ఒక్క పదవిని కానీ, ఒక్క లబ్దిని కానీ ఆశించానా..? నేను, మీరు నమ్మే బైబుల్ మీద ప్రమాణం చేసి నేను ఈ విషయాన్ని చెప్పగలను, మీరు చెప్పగలరా..? మీ కోసం, మీ గెలుపు కోసం ఇంత చేసిన నా పై మీ సొంత ఛానెల్స్ లో విష ప్రచారం చేస్తున్నారే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు షర్మిల. అయితే తెర ముందు జగన్ ఉన్న తెరవెనుక ఆయనను ఆడించే రిమోట్ కంట్రోల్ వేరే ఉన్నారు అది ఆయన భార్య భారతి రెడ్డి అనేది షర్మిల వాదన.
అదలా ఉంటే.., పులివెందుల, కడప లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైస్ భారతి రెడ్డి కడప ఎంపీ స్థానంలో సింగల్ ప్లేయర్ మాత్రమే ఉన్నాడంటూ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ప్రచారం చేసారు. అయితే దీని మీద స్పందించిన సునీత కడప ఎంపీ స్థానంలో సింగల్ ప్లేయర్ గా అవినాష్ రెడ్డే ఉండాలనే ఉద్దేశంతోనే ఆనాడు వివేకాను గొడ్డలితో నరికి చంపారు. ఇప్పుడు కూడా అదే సింగల్ ప్లేయర్ ఎజెండాతో వస్తున్న భారతి రెడ్డి ఈసారి ఎన్నికలలో ఎవరిని గొడ్డలి వేటు వేయనున్నారు అంటూ భారతిని ప్రశ్నించారు.
ఈసారి సింగల్ ప్లేయర్ కోసం నన్ను నరుకుతారా..? లేక షర్మిలను నరుకుతారా..? ఏదైనా జరగొచ్చు. అన్నింటికి తెగించే ముందుకొచ్చా. నా బిడ్డల పేరు మీద వీలునామా కూడా రాసే వచ్చా. ఎవరికీ భయపడే ప్రసక్తి లేదు అంటూ తెగేసి చెప్పారు సునీత. అలాగే ఇన్నాళ్లుగా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది జగనే అయినప్పటికీ దాని వెనుక చక్రం తిప్పింది మాత్రం జగన్ సతీమణి భారతి రెడ్డి అనే విధంగా సునీత, భారతిని టార్గెట్ చేస్తూ తనకు, షర్మిలకు భారతి నుండి ప్రాణ హాని ఉందని చెప్పకనే చెప్పారు.
ఇలా అన్న చేత అవమానించబడిన ఆవేదనతో ఒక చెల్లి షర్మిల, తన తండ్రి చావుకు న్యాయం కోసం గొడ్డలికైనా ఎదురునిలబడతా అనే తెగింపుతో అన్నను నిలదీస్తున్న మరో చెల్లి సునీత కడప రాజకీయాలలో సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పుతున్నారు. అయితే ఇందులో బాధితులుగా చెప్పుకోబడే ఇద్దరు మహిళలే అలాగే వీరి బాధకు, ఆవేదనకు, తెగింపుకి కారణమైన వ్యక్తి మహిళే కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.






