వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణతో డొంక మొత్తం కదులుతోంది. తాజాగా మీడియాకు చిక్కిన సీబీఐ ఛార్జీషీట్ లో వెలుగుచూసిన విషయాలతో… వైఎస్ వివేకా మర్డర్ నిమిత్తం 40 కోట్ల సుపారీ జరిగినట్లుగా, అలాగే ఈ కేసు అంతా కడప ఎంపీ సీటు చుట్టూ తిరిగినట్లుగా సదరు మీడియా ప్రత్యేక కధనాలు ప్రసారం చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి కాల్ డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా సాక్షి విలేఖరులు కావడం విశేషం. నెల్లూరు జిల్లా విలేఖరి బాలకృష్ణారెడ్డి ఒకరు కాగా, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు సాక్షి విలేఖరులకు సీబీఐ రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చింది.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు దేవిరెడ్డి నుండి వీరికి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. అంతేగాక ఆ రోజు సాక్షిలో వివేకా మర్డర్ పై ‘గుండెపోటు’గా తప్పుడు కధనాలు ప్రసారమైన విషయం తెలిసిందే. సాక్షి విలేఖరుల విచారణ జరిగిన తర్వాత బహుశా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనపడుతోంది.
అయితే ‘గుండెపోటు’ కధ అంతా అవినాష్ రెడ్డి స్క్రిప్ట్ అని నేడు ప్రముఖ మీడియా హెడ్ లైన్స్ లో ప్రచురించింది. దీంతో తెలుగుదేశం వర్గాలు ‘సాక్షి’ మీడియాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నాడు ‘నారాసుర రక్తచరిత్ర’ పేరుతో సాక్షిలో ప్రచురితం చేసిన తప్పుడు కధనాలను గుర్తుచేస్తూ సాక్షి యొక్క జర్నలిజం విలువలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.



