మా కేసులు కొలిక్కి తేవా బాబూ?

YS Vivekananda Reddy Murder Case

ఇప్పుడు తెలుగు టీవీ సీరియల్స్ కూడా రెండు మూడేళ్ళలో పూర్తయిపోతున్నాయి. కానీ జగన్‌ అక్రమాస్తుల కేసులు ఏళ్ళు అయినా కొలిక్కి రావడం లేదు. మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకపాత్ర అని జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా చెప్పారు కనుక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ అక్రమాస్తుల కేసులన్నీ ఓ కొలిక్కి తెచ్చి జగన్మోహన్‌ రెడ్డికి సముచిత న్యాయం చేస్తే బాగుంటుంది.

ADVERTISEMENT

అలాగే అక్రమాస్తుల కేసులతో వివేకా హత్య కేసు కూడా పోటీ పడుతూ దిగ్విజయంగా 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ కేసు ఇంకా నడుస్తుండగానే చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి మళ్ళీ మరోసారి లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు కూడా.

ఆ కేసు వలన తనకు మనశాంతి కరువైందని, మానసికంగా చాలా ఆవేదన చెందుతున్నానని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందని చిన్న పిల్లోడు చాలా బాధపడుతున్నాడు. కానీ జగన్మోహన్‌ రెడ్డి మాత్రం ‘తమ్ముడూ… తమ్ముడూ….” అని నోరారా ఆప్యాయంగా పిలుస్తూ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కాలక్షేపం చేసేశారే తప్ప ఆ చిన్న పిల్లోడి బాధను తీర్చలేకపోయారు!

ఆ చిన్న పిల్లోడి బాధను చూడలేక కడప ప్రజలు ఆయనకు ఎంపీ చాక్లెట్ ఇచ్చి ఊరడించారు. కనుక జగన్‌ చెప్పిన్నట్లు చంద్రబాబు నాయుడు మోడీ వద్ద తన పరపతి ఉపయోగించి ఆ కేసు విచారణ వేగవంతం అయ్యేలా చేసి చిన్న పిల్లోడికి తగిన న్యాయం చేయాలి.

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడనే అపవాదుని అనంత బాబు ఇంకా భరిస్తూ కుమిలిపోతూనే ఉన్నారు. కనుక ‘దళిత హత్యా పాతకం’ నుంచి అనంత బాబుకి చంద్రబాబే విముక్తి కల్పించాలి.

వైసీపి నేతలు ఏదో కాస్త ఇసుక, మట్టి, రాళ్ళ కోసం కొండలు, గుట్టలు, చెరువులు తవ్వుకుంటే, ఖాళీగా పడున్న ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు ఇళ్ళు, కార్యాలయాలు కట్టుకుంటే వారిని టిడిపి నేతలు వేలెత్తి చూపిస్తూ నానా మాటలు అంటున్నారు.

ఆ మాటలకు వారు ఎంతగా కుమిలిపోతున్నారో ఎవరికీ తెలీదు. కనుక పోలీసులతోనో కుదరదనుకుంటే సీబీఐ చేతనో విచారణ జరిపించి వైసీపి నేతలకి ఆ నీలాపనిందల నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత కూడా సిఎం చంద్రబాబు నాయుడు మీదే ఉందనే సంగతి మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories