పూజారి తాకితే గానీ మంచినీళ్లు తీర్ధం కావన్నట్లు, రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి టిడిపి కార్యాలయాలపై, కార్యకర్తలపై దాడులు చేసినా ముందుగా స్థానిక జిల్లా ఎస్పీ లేదా మరో పోలీస్ అధికారో ఫలానా ఫలానా టిడిపి నేతలు, కార్యకర్తలు దౌర్జన్యం చేశారంటూ ప్రకటిస్తుంటారు. ఆ తర్వాత మంత్రులు అందరూ మొదలుపెట్టేస్తుంటారు.
గన్నవరం టిడిపి కార్యాలయాన్ని వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేసినప్పుడు ఇదే జరిగింది. టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిని జైలుకి కూడా పంపారు.
ఇప్పుడు పుంగనూరు వైసీపీ శ్రేణుల దాడులు, విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారకుడని జిల్లా ఎస్పీ చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు. దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలను లోపలేస్తామని ప్రకటించేశారు.
శాస్త్రోక్తంగా ఆయన చెప్పవలసిన రెండు ముక్కలూ చెప్పేశారు కనుక ఇప్పుడు మంత్రులందరూ పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారకుడని ఏకగ్రీవ తీర్మానం చేసేశారు.
రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాలలో పర్యటిస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎన్నికల భయం పట్టుకొందని, అందుకే ప్రజలను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారందరూ వైసీపీ కోణంలో ఇంకా చాలానే మాట్లాడుతున్నారు.
చంద్రబాబు నాయుడు జిల్లా యాత్రకు వస్తే వైసీపీ కార్యకర్తలు ఆయనను ఎందుకు అడ్డుకొంటున్నారు? వైసీపీ కంచుకోట కడప జిల్లాలో, జగన్ అడ్డా-పులివెందులలో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు అక్కడ ఎటువంటి గొడవలు, విధ్వంసం జరుగలేదు? కానీ పుంగనూరులోనే ఎందుకు జరిగింది?అంటే అక్కడ వైసీపీ కార్యకర్తలను మోహరించి అడ్డుకోవడం వలననే కదా? లేకుంటే ఈ గొడవలు విధ్వంసం జరిగి ఉండేదా?మరి ఈ విధ్వంసానికి కారణం చంద్రబాబు నాయుడా లేక వైసీపీ నేతలా? వారే చెప్పాలి.



