గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గానికి, డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాల మద్య మొదలైన కుమ్ములాటలు నేడు రోడ్డున పడ్డాయి. నియోజకవర్గానికి అదనపు ఇన్‌ఛార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నిర్మించడంతో ఈ గొడవ మొదలైంది.
తన నియోజకవర్గంలో డొక్కాను అదనపు ఇన్‌ఛార్జిగా నియమించడం ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తనను పక్కన పెట్టి ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారని శ్రీదేవి ఆందోళన చెందుతున్నారు. కనుక గత వారం-పది రోజులుగా ఆమె అనుచరులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం శ్రీదేవి స్వయంగా జిల్లా ఇన్‌ఛార్జి మేకతోటి సుచరిత ఇంటి ముందు ధర్నా కూడా చేశారు.
అయినప్పటికీ పార్టీ అధిష్టానం స్పందించకపోవడంతో, శనివారం ఆమె అనుచరులు తాడికొండలో భారీ ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ విషయం తెలుసుకొన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు కూడా ర్యాలీకి సిద్దమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ఆ పదవిలో నుంచి తొలగిస్తే తప్ప వెనక్కు తగ్గేదేలే అని శ్రీదేవి అనుచరులు వాదిస్తుంటే, వారిని ర్యాలీకి అనుమతిస్తే మేము కూడా ర్యాలీ చేస్తామని డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు వాదిస్తున్నారు.
ఇరు వర్గాల మద్యన ఏవైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని, ఇలా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించవద్దని పోలీసులు హితవు పలికారు. వారికి సర్దిచెప్పి వెనక్కు తిప్పి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి వచ్చే ఎన్నికలలో మళ్ళీ తనకే టికెట్ దక్కుతుందని భావిస్తుంటే, ఈ పదవి ఇవ్వడం ద్వారా తనకు సిఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ ఖాయం చేశారని డొక్కా మాణిక్యవరప్రసాద్ భావిస్తున్నారు. ఇద్దరికీ టికెట్ కావాలి కనుక ఇకపై తాడికొండలో రోజూ ఇటువంటి స్ట్రీట్ ఫైట్స్ కనిపిస్తూనే ఉండవచ్చు.