సామాజిక యాత్రలు కాదు…అభివృద్ధి యాత్రలు అవసరం

ysr congress mlas to start samajikabheri bus tourఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా అప్పులు, సంక్షేమ పధకాలు, రాజకీయ కక్ష సాధింపులు మాత్రమే కనబడుతున్నాయి. అప్పులు, కక్ష సాధింపుల గురించి అధికార పార్టీ ఎలాగూ చెప్పుకోలేదు కనుక తాము ఎంతో నమ్మకం పెట్టుకొన్న సంక్షేమ పధకాల గురించి మాత్రమే అందరూ మాట్లాడుతుంటారు.

అయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలోనో, అమరావతిలో సచివాలయంలోనో కూర్చొని మాట్లాడితే జనాలు వినే రోజులు పోయాయి. కనుక గడప గడపకు వెళ్ళి పలకరించాల్సి వస్తోంది. ఇప్పుడు వైసీపీ అటువంటిదే మరో కార్యక్రమానికి సిద్దం అవుతోంది.

ADVERTISEMENT

తమ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులతో ఈ నెల 26 నుంచి 29వరకు ‘సామాజిక భేరి’ పేరుతో ఉత్తరాంద్ర నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర నిర్వహించబోతోంది. ఈ యాత్ర ప్రధానోద్దేశ్యం ఈ మూడేళ్ళ జగనన్న అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి ఆయా వర్గాలకు వివరించడం. వారికి రాజకీయంగా కూడా జగనన్న చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియజేసేందుకు తామే నిదర్శనం అని నొక్కి చెప్పుకోవడానికి.

ఈ సామాజిక భేరీ యాత్రలో భాగంగా మంత్రులు జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి “వైసీపీలో సామాజిక న్యాయం” అనే విషయం గురించి మరికాస్త గట్టిగా అందరికీ వినబడేలా చెప్పుకొంటారు. ముందస్తు ఎన్నికలు జరుగవని చెపుతూనే మళ్ళీ ఈ హడావుడి, ప్రచారం ఎందుకో అర్ధం కాదు.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కావలసింది అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి జరగాలి. శరవేగంగా రాజధాని అమరావతి నిర్మించుకోవాలి.

ఏపీ నుంచి తెలంగాణ వేరు పడగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్నది ఇదే. కేవలం ఏడేళ్ళలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నంబర్: 1గా తీర్చిదిదారు. అందుకే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, టిఆర్ఎస్‌ నేతలు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినా వారికి గౌరవం లభిస్తుంటుంది.

వారు కూడా “ఇదిగో…మన రాష్ట్రంలో, జిల్లాలలో ఇంత అభివృద్ధి జరిగింది. రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. వాటితో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి…ఈ ప్రాజెక్టులు పూర్తి చేశాము…వీటితో ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఇంత పంట పండింది…” అని సగర్వంగా చెప్పుకొంటారు.

బస్సు యాత్రలకి బయలుదేరుతున్న మన మంత్రులు కూడా వారిలాగ ధైర్యంగా ఈ మూడేళ్ళలో ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పగలరా?అసలు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా?

కనుక ఓట్ల కోసం సామాజిక యాత్రలు చేసే బదులు రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా లేదా?లేకపోతే ఎందుకు జరుగలేదు? అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? అని తెలుసుకొనేందుకు అభివృద్ధి యాత్రలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు.

ADVERTISEMENT
Latest Stories