రాజకీయాలను – కులాలను వేరు చేసి చూసే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఒరవడి పతాక స్థాయిలో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ – జనసేన – వైసీపీలు మూడు సామాజిక వర్గాలకు చెందినవిగా ఉండడంతో, సహజంగానే కులాల రొచ్చు ఎక్కువగా మారింది. అయితే తాజాగా ఎన్టీఆర్ కేంద్రంగా వైసీపీ చేస్తోన్న రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం ద్వారా పుట్టిన పార్టీ అయిన వైఎస్సార్సీపీ, అప్పటి నుండి వైఎస్సార్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారు. ప్రజలలో వైఎస్సార్ కున్న కీర్తి ప్రతిష్టతలను కాంగ్రెస్ పార్టీ నుండి తమ వైపుకు తిప్పుకోవడంలో విజయవంతం అయిన జగన్, నాటి నుండి వైఎస్సార్ సెంటిమెంట్ ను అవసరం వచ్చినప్పుడల్లా పండిస్తూనే ఉన్నారు, ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు.
ఎన్నికలకు ముందయితే వైఎస్ మరణం వెనుక టీడీపీయే ఉందన్న ఎమోషనల్ డైలాగ్ లను కూడా గుప్పించిన జగన్, తద్వారా ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడంలో విజయవంతం అయ్యారు. అయితే అధికారం వచ్చి దాదాపుగా మూడేళ్లు దగ్గర పడుతున్నాయి. ఈ కాలంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలకు తండ్రి గుర్తుగా ‘వైఎస్సార్’ మరియు ‘జగన్’ పేర్లను పెట్టుకున్నారు.
సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి సంబంధించిన పేర్లే పెట్టుకుంటారు గనుక ఇందులో తప్పేమీ లేదు. కానీ అమాంతంగా ఉన్నట్లుండి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై ఎక్కడ లేని అమితమైన ప్రేమను వైసీపీ కనపరుస్తుండడం గమనించదగ్గ విషయం. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం ద్వారా ఈ రాజకీయ ఎత్తుగడ ప్రారంభమైంది.
రాజకీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నుండి గానీ, నందమూరి కుటుంబ సభ్యుల నుండి గానీ వైసీపీ ఆశించిన స్పందన లభించలేదు. దీంతో ఎన్టీఆర్ ను తమ వైపుకు తిప్పుకునే క్రమంలో వైసీపీ కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు, పాలాభిషేకాలు చేస్తూ హంగామా చేసారు. అంతేకాదు ఎన్టీఆర్ ను హైలైట్ చేస్తూ వైసీపీ నేతలు ప్రసంగాలు కూడా చేస్తున్నారు.
బహుశా వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్ కేంద్రంగా ఓట్లు రాబట్టుకోవడానికి చేస్తోన్న ప్రయత్నంలో భాగమో ఏమో గానీ, ఎప్పుడూ ‘వైఎస్సార్’ నామస్మరణ మాత్రమే చేసే వైసీపీ వర్గాలు, ప్రస్తుతం “ఎన్టీఆర్” భజన చేస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా జగన్ చేస్తోన్న పాలన వలన ప్రజలలో వైఎస్సార్ పై ఉన్న అభిమానం కూడా సన్నగిల్లిందని చెప్పడానికి నిదర్శనమా?
జగన్ చేస్తోన్న పరిపాలన సర్వత్రా హాట్ టాపిక్ గా నిలవడంతో, సహజంగానే తండ్రి వైఎస్సార్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తున్నారు. ఈ సందర్భంగా నాడు వైఎస్సార్ హయాంలో జరిగిన స్కాంలు, అవినీతి కేసులు, తద్వారా జగన్ చుట్టూ చేరుకున్న అక్రమాస్తుల కేసులు చిట్టాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో ఈ సారి ఎన్నికలలో ‘వైఎస్సార్’ బొమ్మ కంటే కూడా ‘ఎన్టీఆర్’ను నమ్ముకోవడం ఉత్తమం అని ‘జగన్ అండ్ కో’ భావిస్తున్నారా?
ఏమో రాజకీయాలు ఎప్పుడు ఎటు వైపుకు టర్న్ చేసుకుంటాయో తెలియదు. ఎన్టీఆర్ పేరును వైసీపీ వినియోగించుకుని సరికొత్త రాజకీయానికి తెరలేపినట్లు అయితే పొలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అయితే వైసీపీ ఆశించినట్లుగా ఎన్టీఆర్ పేరు తమ పార్టీకి అనుకూలంగా మారుతుందా? అంటే అది మాత్రం ఎప్పటికి జరగకపోవచ్చన్న సమాధానమే చరిత్ర చెప్తోంది.
ఎందుకంటే ఎవరెన్ని రాజకీయాలు చేసినా “ఎన్టీఆర్ – టీడీపీ”ని వేరు చేయడాన్ని తెలుగు ప్రజలు అంగీకరించేది లేదని వివిధ సందర్భాలలో స్పష్టంగా చెప్పారు. నాడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత సతీమణి లక్ష్మీ పార్వతి ఓ పార్టీ పెట్టగా, తనయుడు హరికృష్ణ మరో పార్టీ పెట్టారు. అలాగే టీడీపీని అంటిపెట్టుకుని చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.
ఈ ముగ్గురు కూడా “ఎన్టీఆర్” బొమ్మ కేంద్రంగానే ఎన్నికలకు వెళ్ళగా, ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే నిలిచారు. అంటే సొంత కొడుకు మరియు సతీమణిలు చేసిన ప్రయత్నాలను కూడా పక్కనపెట్టి, కేవలం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే గెలిపించిన చరిత్ర తెలుగు ప్రజలది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ కేంద్రంగా వైసీపీ చేస్తోన్న రాజకీయాలకి తలొగ్గి, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, విగ్రహానికి పాలాభిషేకం చేసారని వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు గుద్దేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.



