కారణం ఏదైనా నిరసన తెలిపే విధానాలు రెండే ఉంటాయి… ఒకటి దీక్ష, మరొకటి బంద్. దీక్ష అయితే ఒక రోజో, రెండు రోజులో ముందుగానే కాల పరిమితి ప్రకటించి దీక్షకు కూర్చునే విధానం కాగా, బంద్ అయితే ఆర్టీసీ బస్సులకు బ్రేకులు, ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, స్కూల్స్ కు తాళాలు వేయడం. ఇది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సహజంగా అనుసరించే విధానాలు.
కేంద్రంపై టిడిపి అవిశ్వాసం పెట్టినందుకు నిరసనగా మంగళవారం నాడు బంద్ కు పిలుపునిచ్చారు జగన్. అదేలెండి… అవిశ్వాసం పెట్టడమే కాకుండా, పార్లమెంట్ లో ఒక రోజంతా చర్చ జరగడం… అందులోనూ టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు కేంద్రాన్ని పార్లమెంట్ లోనే కడిగి పారేయడంతో క్రెడిట్ అంతా టిడిపికి ఎక్కడ వెళ్ళిపోతుందేమోనని బంద్ కు ఆదేశాలిచ్చారు జగన్.
దీనికి ఇతర పార్టీలు సహకరించాలని, అన్ని సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. అంతేకాదు పార్లమెంట్ లో మరోసారి కేంద్రాన్ని విమర్శించే అవకాశం లేకుండా తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టిడిపి ఎంపీలు వెంటనే రాజీనామాలు చేయాలని, అదే సరైన పద్ధతి అంటూ చెప్పుకొచ్చారు. జగన్ బయటకు చెప్పిన భావజాలం ఇది కానప్పటికీ, అంతర్లీనంగా ఉండేది ఇదేనన్న అంశం పొలిటికల్ వర్గాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.




