ysrcp-anniversary-review

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 15వ అవిర్భావ దినోత్సవం జరుపుకోబోతోంది. కనుక ఆ పార్టీ ప్రస్థానాన్ని, విధానాలను, వాటి ఫలితాలు లేదా పర్యావసనాలను ఓసారి సమీక్షించి చూడాల్సిన సమయమిది.

Also Read – రచ్చ గెలిచేసాడు.. మరి ఇంట..?

ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే. కనుక ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. వైసీపీ కూడా అలాగే చేసింది.

కానీ జగన్‌, వైసీపీ విధానాలలో, పోరాటాలలో నీతి నిజాయితీ, విలువలు, విశ్వసనీయత అనే మంచి లక్షణాలే లోపించాయి. ఇందుకు గొప్ప ఉదాహరణకు తండ్రి వైఎస్ సమాధి వైసీపీకి పునాది కావడమే.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

జగన్‌ అహంభావం కలిగిన నాయకుడు. కాంగ్రెస్ అధిష్టానం ముందు చేతులు కట్టుకొని నిలబడలేరు. కనుకనే వైసీపీని స్థాపించారు. తండ్రి ఆకస్మిక మరణంతో ప్రజలలో ఏర్పడిన సానుభూతిని తెలివిగా ఉపయోగించుకొని ఓదార్పు యాత్రలతో వైసీపీని నిర్మించుకున్నారు.

సాక్షి మీడియా ఏర్పాటు జగన్‌ రాజకీయ వ్యూహాలలో భాగమే. తన ఆలోచనలు, కోరికలను ఆశయాల పేరుతో ప్రజలకు చేరవేసేందుకు, తన రాజకీయ ప్రత్యర్ధులను చీల్చి చెండాడేందుకు దానిని చేసుకున్నారు. చేతిలో బలమైన మీడియా ఉంది కనుకనే అక్రమాస్తుల కేసులలో చంచల్‌గూడా జైలుకి వెళ్ళి వచ్చినా తన రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేక జరిగిన కుట్ర అని తెలివిగా ప్రచారం చేసుకోగలుగుతున్నారు.

Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్

మాట తప్పను.. మడమ తిప్పనని గొప్పగా చెప్పుకునే జగన్ ‘తెలంగాణ ప్రజల సెంటిమెంట్’ గౌరవిస్తానని చెప్పి, తెలంగాణలో తననే నమ్ముకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలని రోడ్డున పడేశారు.

కనీసం జగన్‌ చేసిన సమైక్యాంధ్ర, ప్రత్యేకహోదా పోరాటాలలో నిజాయితీ లేదు. ఆయన ఉద్దేశ్యాన్ని ప్రజలు బాగానే పసిగట్టి దూరంగా పెట్టారు.

కానీ అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు జగన్‌ తన లక్ష్య సాధన కోసం చాలా శ్రమించారనేది ఎంత వాస్తవమో తన లక్ష్య సాధనలో నెచ్చెనలుగా వాడుకున్న తల్లి, చెల్లి, విజయసాయి రెడ్డితో సహా ప్రతీ ఒక్కరినీ దెబ్బ తీశారనేది కూడా అంతే వాస్తవం.

జగన్‌ తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకునేందుకు రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్‌తో చేతులు కలిపి ఆయన సాయంతో చంద్రబాబు నాయుడుని గద్దె దించేశారు. రాజకీయాలలో ఇటువంటి సహజం కనుక అందుకు వారిరువురినీ తప్పుపట్టలేము.

జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఆయనలో ఈ లోపాలన్నీ మరుగునపడేవి. కానీ అరాచక, విధ్వంస పాలనతో తన విశ్వరూపం ప్రదర్శించి అందరూ భయపడేలా చేశారు. కనుక వైసీపీకి ఘన విజయానికి జగన్‌ ఏవిదంగా కారకుడో, దాని పతనానికి కూడా ఆయన మాత్రమే కారకుడు అని చెప్పక తప్పదు.

తన రాజకీయ ద్వేష భావనలు, వికృత ఆలోచనలను పార్టీ విధానాలుగా మార్చేసి, వాటిని అందరి చేత అమలు చేయించినందున, ఇప్పుడు పోసాని, వర్మవంటి వారితో సహా వైసీపీలో అందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఎవరినీ లెక్కచేయలేదు. కనుక అప్పుడు ఎవరూ ఆయనకు సలహాలు చెప్పలేకపోయేవారు. శాసనసభ సమావేశాలకు హాజరవడం మన బాధ్యత అని బొత్స సత్యనారాయణ వంటివారు కూడా చెప్పలేకపోతున్నారంటే జగన్‌ అహంభావ ధోరణిని, ఆ పార్టీలో నేతల పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు.

ఓ పక్క వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జోరుగా సాగుతుంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం తప్పు కాదు. కానీ ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు ఎదిగి, మళ్ళీ పాతాళానికి పడిపోయినప్పుడు, ఏమీ జరగన్నట్లు, నీతులు వల్లిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.




ఎన్నికలలో ఓడినప్పుడు ఎలాగూ ఆత్మవిమర్శ చేసుకోలేదు. కనీసం ఇప్పుడైనా వైసీపీ దుస్థితికి కారణం ఎవరు? ఏమిటి?అని ఆలోచించి ఆలోచనలను, లోపాలను సరిచేసుకుంటే వైసీపీకి భవిష్యత్‌ ఉంటుంది. కాదని గుడ్డిగా ముందుకు సాగితే జగన్‌తో సహా వైసీపీలో ఆయనని నమ్ముకున్న ప్రతీ ఒక్కరూ నష్టపోతారు. ఇది గ్రహించేసరికి చాలా ఆలస్యమైపోతుంది.